Palle Palleku Seethakka Programme: నిత్యం ప్రజల్లో ఉండేందుకు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ మంత్రి సీతక్క సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పల్లెకు సీతక్క అనే కార్యక్రమాన్ని సీతక్క చేపట్టారు. తన సొంత నియోజకవర్గం ములుగులో గ్రామ గ్రామాల్లో పర్యటించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. నియోజకవర్గ అభివృద్ధిపై సీతక్క పరిశీలన చేయనున్నారు.
పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ములుగు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దనసరి అనసూయ సీతక్క పర్యటించారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పల్లె పల్లెకు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడారు. గ్రామాల్లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతి కారణంగానే బ్యారేజీ దెబ్బతిన్నది. రూ.లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు పరిస్థితి నేడు ఎలా ఉందో ప్రజలకు తెలులు. కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు చేయడం మానేసి.. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరించాలి' అని సూచించారు. 'కాళేశ్వరం వద్ద నీటిని నిల్వ చేస్తే ప్రమాదం ఉందని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం ప్రాంతాలతో పాటు పినపాక, భద్రాద్రి ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలోనే అక్కడ నీటి నిల్వ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అని వివరించారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనలకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నట్లు సీతక్క స్పష్టం చేశారు.
గోదావరి జలాలను వృథా కాకుండా పలు మార్గాల ద్వారా అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నట్లు.. దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకునే చర్యలు చేపడుతున్నట్లు సీతక్క వెల్లడించారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు సీతారామ ప్రాజెక్టులో నీటిని నింపుతూ అవసరమైన విధంగా వినియోగిస్తున్నామని చెప్పారు. రామప్ప చెరువును నింపి అక్కడి నుంచి పరిసర ప్రాంతాల మండలాలకు నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ములుగు జిల్లాలో తాగునీరు, సాగునీటి అవసరాలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించారు.
గోదావరిలో లభ్యమయ్యే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క వివరించారు. దేవాదుల ప్రాజెక్టుతో నర్సంపేట, పాలకుర్తి, జనగాం, స్టేషన్ ఘన్‌పూర్ తదితర నియోజవకర్గాలకు కూడా నీటిని తరలిస్తున్నామని.. నీటి నిర్వహణకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని బీఆర్‌ఎస్ పార్టీకి హితవు పలికారు.
దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని.. ఇది ప్రకృతిలో వచ్చిన మార్పుల ఫలితమని మంత్రి సీతక్క వివరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులు, పేదలకు అండగా నిలవాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు, ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం రెండింటికీ తాము ప్రాధాన్యమిస్తున్నామని.. రైతుల కష్టాలను గుర్తించి, వారికి అవసరమైన సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.