Andhra Pradesh CPS to OPS: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. CPS నుంచి OPSకు మారేందుకు సర్వం సిద్ధం?!
CPS To OPS Employees In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన CPS ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2004 సెప్టెంబర్ 1కి ముందే నియామక ప్రకటన వెలువడిన ఉద్యోగులకు ఈ అవకాశం వర్తిస్తుంది. నిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం నాలుగు కీలక సర్టిఫైడ్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగులు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోవాలి.
CPS To OPS Employees In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విధానానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగులు పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ప్రకటించిన వన్‌టైమ్ ఆప్షన్‌కు సంబంధించి తాజాగా దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలపై స్పష్టత ఇచ్చింది.
ఎవరికి ఈ అవకాశం వర్తిస్తుంది?
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే ఉద్యోగ నియామక ప్రకటన విడుదలై, ఆ తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరి ప్రస్తుతం CPS పరిధిలో ఉన్న ఉద్యోగులు ఈ అవకాశానికి అర్హులు కావచ్చు. గతంలో జారీ చేసిన GO Ms No.53లోని అర్హత నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారితో పాటు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
నిధి పోర్టల్‌లోనే దరఖాస్తు
CPS నుంచి OPSకు మారాలనుకునే వారు NIDHI పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా CPS - OPS Conversion ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ పాత NIDHI లాగిన్ వివరాలతోనే దరఖాస్తు చేయవచ్చు. రిటైర్డ్ ఉద్యోగులు, VRS తీసుకున్నవారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, సాంకేతికంగా రాజీనామా చేసిన ఉద్యోగులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నాలుగు పత్రాలు తప్పనిసరి
దరఖాస్తు చేసుకునే ముందు ఉద్యోగులు తమ ప్రారంభ నియామక శాఖలోని Initial Appointing Authority (IAA)ని సంప్రదించి నాలుగు పత్రాల ధ్రువీకరించిన కాపీలు పొందాలి.
1) ఉద్యోగ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ లేదా ప్రకటన.
2) రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ విడుదల చేసిన సెలక్షన్ లిస్ట్.
3) ఉద్యోగ నియామక అపాయింట్‌మెంట్ ఆర్డర్.
4) విధుల్లో చేరేందుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు.
అభ్యర్థన అందిన 15 పని దినాల్లో ఈ పత్రాల కాపీలు అందించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
దరఖాస్తు పరిశీలన ఎలా జరుగుతుంది?
పత్రాలను NIDHI పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయ DDOకు దరఖాస్తు సమర్పించాలి. రిటైర్డ్ ఉద్యోగులు చివరిగా పనిచేసిన కార్యాలయ DDOను సంప్రదించాలి. DDO దరఖాస్తును IAAకు పంపగా, సంబంధిత అధికారి ఏడు రోజుల్లో వివరాలను ధ్రువీకరించాలి. అనంతరం DDO పది రోజుల్లో తదుపరి ప్రక్రియ పూర్తి చేయాలి. చివరిగా సంబంధిత PAO లేదా DTO పరిశీలనతో పాటు కాంపిటెంట్ అథారిటీ ఆమోదం అనంతరం తుది ఉత్తర్వులు జారీ అవుతాయి.
ఈ నేపథ్యంలో CPS నుంచి OPSకు మారాలనుకునే ఏపీ ఉద్యోగులు తమ నియామక పత్రాలను సిద్ధం చేసుకుని, అర్హత నిబంధనలను పరిశీలించుకోవడం ఎంతో ముఖ్యం.