SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్..

AP Muncipal Poll: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పోలింగ్‌కు అంతా రెడీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల పరిధిలో రేపు (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ ప్రక్రియ కోసం అధికారులు ఇవాళ నుంచే పంపిణీ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణీ చేపడుతున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 31, 2026, 09:49 AM IST | Updated: Oct 31, 2026, 09:51 AM IST
Image Credit: AP Mucipal Elections (ZEE News/Source)
Join

Andhra Pradesh Local Body Election: ఎన్నికలను నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 36వేల 351 మంది పోలీసు సిబ్బందితో 4వేల 372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 1,233 సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇక పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు 1వేయి 543 రూట్ మొబైల్ బృందాలను రంగంలోకి దింపారు.

స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత..

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, సంబంధిత కేసుల్లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 107 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన 111 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 4,655 మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో అవాంఛనీయ ఘటనలు జరిగి పోలింగ్ ఆగిపోతే, అటువంటి ప్రాంతాల్లో నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

ప్రలోభాల పర్వం.. 
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో పలుచోట్ల ప్రలోభాల పర్వం మొదలైంది. విజయవాడలోని ఓ డివిజన్‌లో ప్రధాన పార్టీ అభ్యర్థి మహిళలకు వందరూపాయల విలువైన చీరలు, స్వీట్ బాక్సులు, స్టీల్ క్యాన్లు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఓటుకు 500 నుంచి వేయి రూపాయల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు విశాఖలోని ఓ డివిజన్‌లో ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు 2 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రేపు పోలింగ్, 3న కౌంటింగ్ జరగనుంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు.. 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది. మరోవైపు పోలింగ్‌కు ముందే పలు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రెండు జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 73 వార్డులు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.  తిరుపతి జిల్లాలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు గాను రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. సూళ్లూరుపేట మున్సిపాలిటీలో రెండు వార్డులు, పుత్తూరు మున్సిపాలిటీలో ఒక వార్డు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో తిరుపతి జిల్లా పరిధిలో మొత్తం 5 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.  

ఏకగ్రీవాల్లో చిత్తూరు రికార్డు..

ఇక చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా నమోదైంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లకు గాను 51 డివిజన్లు ఏకగ్రీవం అయినట్ల సమాచారం అందుతోంది. మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను 13 వార్డులు, నగరి మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో 68 వార్డులు, తిరుపతి జిల్లాలో ఐదు వార్డులు కలిపి మొత్తం 73 వార్డులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. ఏకగ్రీవమైన స్థానాలు మినహా మిగిలిన వార్డుల్లో రేపు పోలింగ్ జరగనుంది. రెండు జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నామినేషన్ల సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ అనంతరం వెలువడే ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES