Telangana NMMS Scholarship: ఆర్థికంగా వెనకబడిన నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ అండగా నిలుస్తోంది. ఈ స్కీమ్ తెలంగాణలోని సర్కారు బడుల విద్యార్థులకు ఒక గొప్ప ఆర్థిక భరోసాగా నిలుస్తోంది. ఈ స్కీములో ఎంపికైన ప్రతి విద్యార్థికి 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 4ఏండ్ల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున మొత్తం 48వేల రూపాయల ఆర్థికసాయం అందుతుంది. ఈ పరీక్ష రాసిన ప్రతి 10 మందిలో ఒకరికి స్కాలర్ షిప్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ రాష్ట్రంలోని 4,805 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 33వేల మంది అంటే 16.5శాతం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 2లక్షల మంది విద్యార్థులు 33వేల మంది విద్యార్థులు మాత్రమే ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు. లోపం ఎక్కడుంది?
ఇంత తక్కువ దరఖాస్తులు నమోదవ్వడానికి.. క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్నో సమస్యలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,000కు పైగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల 7వ తరగతి సిలబస్ సరిగ్గా పూర్తికావడం లేదు. NMMS పరీక్షలో 7వ తరగతి సిలబస్ 60 శాతం, 8వ తరగతి సిలబస్ 40 శాతం ఉంటుంది. కానీ సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక ప్రాథమిక స్థాయిలోనే పునాది లోపించడం వల్ల విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి జంకుతున్నారు.
ఈ సమస్యలను అధిగమించి.. రాబోయే విద్యాసంవత్సరంలో లక్ష మందికి పైగా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలాస్ కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో దాదాపు 12,000 ప్రాథమిక పాఠశాలలు కేవలం ఒకటి లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్నందున.. నాణ్యమైన విద్య అందించేందుకు జీవో నంబర్ 25ను వెంటనే సవరించి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని కోరుతున్నారు.
అలాగే 4వ తరగతి విద్యార్థులకు గురుకుల ఎంట్రెన్స్ పుస్తకాలు ఇస్తున్నట్లే, 8వ తరగతిలో NMMS పరీక్ష రాయబోయే విద్యార్థులకు 7వ తరగతిలోనే ప్రత్యేక ఎంట్రెన్స్ పుస్తకాలు అందిస్తే పునశ్చరణ సులువై వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశాలను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయులు కోరారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ NMMS స్కాలర్‌షిప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులపై ఎంతైనా ఉంది. క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నిరంతరం మార్గదర్శనం చేస్తూ.. వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తేనే గ్రామీణ నిరుపేద విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
Also Read: