AP Tax Collections: వాణిజ్య పనుల్లో ఆంధ్రప్రదేశ్ దూకుడు.. సెప్టెంబర్ 2026 నాటికి 18 శాతం వృద్ధి
Andhra Pradesh Record Commercial Taxes Collections Of Rs 30435 Crore And 18 Percent Increased Growth: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. పన్నుల వసూళ్లలో ఏపీ గణనీయంగా వృద్ధి సాధిస్తోంది. సెప్టెంబర్ నెల వరకు చూస్తే 18 శాతం వృద్ధి నమోదైంది. ఇక వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.30 వేల కోట్లకు చేరాయి. ఏపీ వాణిజ్య పన్నుల వసూళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి.
AP Tax Collections Growth: ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడీన పడడమే కాదు ఉరకలు వేస్తోంది. అత్యధికంగా పన్నుల వసూళ్లతో రికార్డులు నెలకొల్పుతోంది. ఆదాయ సముపార్జనలో వాణిజ్య పన్నులు అత్యధికంగా వసూళ్లు రాబడుతున్నాయి. ఏపీ కమర్షియల్ పన్నుల వసూళ్లు ఇప్పటివరకు 18 శాతం వృద్ధి సాధించగా.. సెప్టెంబర్ వరకు దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా వాణిజ్య పన్నులు వసూళ్లయ్యాయి. వాణిజ్య పన్నుల్లో ఏపీ అద్భుత పురోగతి సాధిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆదాయ సముపార్జనలో సరికొత్త పుంతలు తొక్కుతోంది. క్రమశిక్షణతో కూడిన పురోగతిని సాధిస్తూ పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం అంటే సెప్టెంబర్ 2026 ముగిసే సమయానికి రాష్ట్ర వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.30,435.98 కోట్లకు చేరాయి. అయితే గతేడాది ఇదే సమయానికి రూ.25,892.92 కోట్లు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధిని సాధించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన సుస్థిర ప్రగతిని వాణిజ్య పన్నుల శాఖ కొనసాగిస్తోంది. సుస్థిర ప్రగతి కొనసాగిస్తూ తన ఆదాయ మార్గాన్ని వాణిజ్య పన్నుల శాఖ మరింత విస్తరించుకుంది. సెప్టెంబర్ 2026 నెల ఒక్కదానిలోనే మొత్తం వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.4,986.18 కోట్లుగా నమోదయినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 2025తో పోలిస్తే ఇది 15.03 శాతం (రూ.651.34 కోట్లు ఎక్కువ) పెరుగుదల కావడం విశేషం.
నెట్ జీఎస్‌టీలో వృద్ధి
జీఎస్‌టీ రంగాన్ని పరిశీలిస్తే సెప్టెంబర్ 2026 నాటికి నెట్ జీఎస్‌టీ వసూళ్లు రూ.19,635.49 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయానికి రూ.16,760.21 కోట్లుగా ఉంది. నెట్ జీఎస్‌టీ వసూళ్లలో కూడా 18 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ 2026 నెలలో నెట్ జీఎస్‌టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 14.10 శాతం పెరిగి.. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.2,789.50 కోట్ల నుంచి రూ.3,182.87 కోట్లకు చేరాయి. నెట్ జీఎస్‌టీ అనేది రాష్ట్రంలో పెరిగిన వినియోగాన్ని సూచిస్తుంది. మెరుగైన పన్ను నిబంధనల అమలు, కఠినమైన పర్యవేక్షణ, విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాల కారణంగా ఈ వృద్ధి నమోదైంది.
జీఎస్‌టీ 2.0 రేట్ల సరళీకరణ, పన్ను నిర్మాణాన్ని సులభతరం చేయడం, వ్యాపారాలకు నిబంధనలు సడలించడం.. వారిపై భారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవడం వాణిజ్య పన్నులు పెరగడానికి కారణమైంది. మార్కెట్ వాతావరణం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏపీ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ ఏడాది ప్రవేశపెట్టిన పలు వినూత్న సాంకేతిక సంస్కరణలు ఆదాయాన్ని గణనీయంగా పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం, యూపీఐ ఆధారిత డిజిటల్ తనిఖీలు, డిస్కమ్‌ల ఆధారిత నమోదు ధృవీకరణ, ఆధార్ ఆధారిత ప్రొఫెషనల్ టాక్స్ విస్తరణ, వృత్తి పన్నును మరింత సమర్థవంతంగా అమలు చేయడం తదితర చర్యలతో వాణిజ్య శాఖ గణనీయంగా వృద్ధి సాధించింది.
సెప్టెంబర్ 2026 - రాబడి అంచనాలు
నెట్ జీఎస్‌టీ వసూళ్లు: రూ.3,182.87 కోట్లు
వార్షిక వృద్ధి : 14.10 శాతం (సెప్టెంబర్ 2025తో పోలిస్తే)
ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్: రూ.1,927.62 కోట్లు (20.12 శాతం వృద్ధి)
పెట్రోలియం వ్యాట్: రూ.1,666.91 కోట్లు (20.77 శాతం వృద్ధి)
ప్రొఫెషనల్ ట్యాక్స్: రూ.43.53 కోట్లు (3.99 శాతం వృద్ధి)