రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
AP CM Review Meeting On Heavy Rains:బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలపై చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఎస్‌తో పాటు డీజీపీతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
Rain Alert CM Review: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయుగుడం దూసుకొస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర వైపు వస్తోంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల తీవ్రత పెరుగుతోంది.ఈ రోజు మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం - కవిటి మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ అప్రమత్తం..
తీరం దాటే సమయంలో గంటలకు 85 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల 24, 25వ తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు.
121 మండలాల్లో సాధారణ వర్షపాతం..
మొత్తంగా 261 మండలాల్లో 129 మండలాకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 121 మండలాల్లో సాధారణ వర్షపాతం.. 9 మండలాల్లో అతి భారీ వర్షం.. 2 మండలాలకు తీవ్ర వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ముంపు పొంచి ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నదుల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి... రిజర్వాయర్లలో నీటి నిల్వలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశం చేశారు.