AP Global Horticulture Hub: రాయలసీమలో రూ.1 లక్ష కోట్లతో భారీ ప్రాజెక్ట్..రతనాల సీమగా రూపురేఖలు మార్చే 'గ్లోబల్ హార్డికల్చర్ హబ్'!
AP Global Horticulture Hub Launch: రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన రైతులకు కొండంత అండగా నిలుస్తూ, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రూ.1 లక్ష కోట్ల భారీ అంచనా వ్యయంతో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్' ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చారిత్రాత్మక పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ 'పూర్వోదయ' పథకం కింద రూ.40,352 కోట్ల ప్రభుత్వ నిధులు, మిగిలిన రూ.60,000 కోట్లను ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా సాధించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
AP Global Horticulture Hub Launch: ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంత ఉద్యాన రైతుల భవిష్యత్తును విప్లవాత్మకంగా మార్చేందుకు మొత్తం మూడు దశల్లో రూ.1 లక్ష కోట్ల ఖర్చుతో ఈ హబ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ 'పూర్వోదయ' పథకం ద్వారా రూ. 40,352 కోట్ల ప్రభుత్వ సహాయం అందుతుండగా, ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో రూ. 60,000 కోట్లను ఆకర్షించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
ప్రాంతీయ విస్తరణ, క్లస్టర్ల వర్గీకరణ..
ఈ బృహత్తర ప్రాజెక్టు పరిధిని రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు పొరుగునున్న ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు కూడా విస్తరించారు. మొత్తం 10 జిల్లాలలో విస్తరించిన 303 మండలాలు, 5,869 గ్రామాలను సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం 201 క్లస్టర్లుగా వర్గీకరించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 8.41 లక్షల హెక్టార్ల ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని మరో 6 లక్షల హెక్టార్లు పెంచి మొత్తం 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించాలని నిర్ణయించారు. దీని ద్వారా వార్షిక ఉద్యాన ఉత్పత్తుల సామర్థ్యాన్ని 222 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 435 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేలా లక్ష్యాలను నిర్దేశించారు.
రైతు సంక్షేమం, నిధుల కేటాయింపు..
ప్రభుత్వ నిధులైన రూ. 40,352 కోట్లలో అత్యధికంగా నీటిపారుదల రంగానికి రూ. 20,884 కోట్లు, ఉద్యాన రంగానికి రూ. 15,000 కోట్లు, రహదారుల అనుసంధానానికి రూ. 4,562 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధుల వల్ల కొత్తగా 9 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీటి వసతి కలగడంతో పాటు, 4.3 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది.
ఫలితంగా దాదాపు 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మామిడి, అరటి, టమోటా వంటి సాంప్రదాయ పంటలతో పాటు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో వంటి అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగును ప్రోత్సహిస్తూ, ఉత్పత్తుల విలువ పెంపు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు నెలలుగా జరిపిన సుదీర్ఘ కసరత్తు, కేంద్రంతో జరిపిన చర్చల ఫలితంగానే ఈ ప్రాజెక్టు సాకారమై సీమ రాతను మార్చనుంది.