AP Investments: తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ ‘గైడెన్స్ తమిళనాడు’ నుంచి కొందరు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌కు రావడం, మరో వైపు తమిళనాడులో పరిశీలనలో ఉన్న కొన్ని పారిశ్రామిక ప్రతిపాదనలు ఏపీకి రావడంపై దుమారం రేగింది. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.పెట్టుబడుల ఆకర్షణలో రెండు రాష్ట్రాల మధ్య పోటీ నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన ఆటో విడిభాగాల తయారీ సంస్థలు అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం, గైడెన్స్ తమిళనాడు మాజీ ఉద్యోగులు ఏపీలో ఉన్నత ఉద్యోగాల్లో చేరడంతో డేటా లీకేజీ ఆరోపణలు ఈ చర్చకు కారణమయ్యాయి.
గైడెన్స్ తమిళనాడు నుంచి ఏపీకి ముగ్గురు:
తమిళనాడు ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ గైడెన్స్ తమిళనాడులో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులు ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)లో చేరారు. ప్రీజా ప్రసాద్, క్రిస్టో లారెల్, ప్రభాకరన్ ఏపీ సంస్థలో బాధ్యతలు చేపట్టినట్లు తమిళ పత్రికల్లో నవంబర్ 19న కథనాలు రావడంతో కలకలం రేగింది. లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌లో కొద్ది నెలల క్రితమే వారు ఈ సమాచారాన్ని అప్టేట్ చేశారు. గతంలో తమిళనాడులో పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక సంస్థలతో సమన్వయం వంటి బాధ్యతలు నిర్వహించారు. ఏపీలో చేరిన అనంతరం విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభినందనలు అందుకున్నట్లు సమాచారం.
2025 జనవరి వరకు తమిళనాడు గైడెన్స్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సరిన్ పరపరకాంత్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. అప్పటికి తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఇదే సమయంలో గైడెన్స్ తమిళనాడు నుంచి మరికొందరు ఉద్యోగులు రాజీనామా చేసి ఇతర రాష్ట్రాల పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థల్లో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఏపీతో పాటు కర్ణాటక, తెలంగాణ సంస్థల్లోనూ కొందరు ఉద్యోగాలు పొందారు.
15 మంది సిబ్బంది తొలగింపుపై వివాదం:
గైడెన్స్ తమిళనాడుకు చెందిన 15 మంది కాంట్రాక్టు సిబ్బందిని తొలగించినట్లు నవంబరు 19న వార్తలు వెలువడ్డాయి. తమిళనాడులో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఏపీకి చేరవేశారన్న అనుమానంతో ఈ ఏడాది ఆగస్టు,జులైలో వారిని తొలగించినట్టు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.
మరోవైపు, తొలగింపునకు గురైనట్లు వార్తల్లో పేర్కొన్న వారిలో 13 మంది స్వచ్ఛందంగా రాజీనామా చేసి నోటీసు గడువు కూడా పూర్తి చేశారని కొందరు మాజీ ఉద్యోగులు తెలిపారు. సంస్థలో పని వాతావరణం, ఉన్నతాధికారులతో విభేదాల కారణంగానే తాము బయటకు వెళ్లామని, సమాచార లీకేజీ ఆరోపణలకు ఆధారాలు చూపలేదని వారు పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
అసలు లక్ష్యం ఏమిటి...?
తమిళనాడు గైడెన్స్ నుంచి ఉద్యోగులు ఏపీకి వెళ్లడంపై తమిళనాడులో రాజకీయంగా దుమారం రేగింది. తమిళనాడు నుంచి పెట్టుబడులు తరలిపోవడంపై డీఎంకే విమర్శలు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి, టీవీకే శివకాశి ఎమ్మెల్యే కీర్తనను ప్రత్యర్థులు టార్గెట్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కీర్తన పొలిటికల్ కన్సల్టెన్సీలో పని చేశారు. చిత్తూరు జిల్లా మూలాలు ఉన్న కీర్తన కుటుంబం తమిళనాడులో స్థిరపడింది. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తరపున పనిచేసిన పొలిటికల్ కన్సల్టెన్సీ గ్రూపులో సోషల్ మీడియా విభాగాలను కీర్తన పర్యవేక్షించారు. గతంలో పలు రాష్ట్రాల్లో పొలిటికల్ కన్సల్టెన్సీ తరపున పనిచేసిన అనుభవం ఆమెకు ఉందని ఆమె సహచరులు చెబుతున్నారు.
మరోవైపు ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పనిచేసిన కన్సల్టెన్సీ ప్రతినిధులకు ప్రభుత్వ విధుల్లో బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కీర్తన టీవీకేలో చేరి శివకాశి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతో ఆమెకు సత్సంబంధాలు ఉండటంతో దానిని రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్‌గా చేసుకున్నారని గతంలో కీర్తనతో కలిసి పనిచేసిన కన్సల్టెన్సీ ప్రతినిధులు వివరించారు. ఇదే సమయంలో విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం అందరినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే తాజా వివాదం వెలుగులోకి వచ్చింది.
తమిళనాడు పెట్టుబడులు వచ్చాయా? అనంతపురంలో రూ.1,614 కోట్ల పెట్టుబడులు:
తమిళనాడు నుంచి ఏపీకి పెట్టుబడుల తరలింపుపై చర్చకు దక్షిణ కొరియాకు చెందిన మూడు ఆటో విడిభాగాల తయారీ సంస్థల ప్రతిపాదనలు ప్రధాన కారణంగా నిలిచాయి. హ్వాషిన్, సియోన్, ఐవామెట్ సంస్థలు అనంతపురం జిల్లాలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ మూడు సంస్థల ప్రతిపాదిత పెట్టుబడుల విలువ రూ.1,614 కోట్లు. వీటి ద్వారా సుమారు 1,418 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా.
ఈ సంస్థలు హ్యుందాయ్, కియా వంటి వాహన తయారీ కంపెనీలకు విడిభాగాలు సరఫరా చేస్తాయి. తమిళనాడు అధికారులు కూడా గతంలో ఈ సంస్థలతో చర్చలు జరిపినట్లు వార్తా కథనాలు వచ్చాయి. అయినా అనంతపురంలో పెట్టుబడులు పెట్టేందుకు అవి ముందుకు రావడంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కియా కార్ల తయారీకి మాతృ సంస్థగా ఉన్న హ్యుండాయ్కు తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
ఈ క్రమంలో కియా ప్లాంట్ల విస్తరణకు పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందలు చేసుకుంది. ఈ పెట్టుబడులకు తమిళనాడు పెట్టుబడులతో సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురంలో కియా తయారీ కేంద్రానికి సమీపంలో విడిభాగాల యూనిట్లు ఏర్పాటు చేయడం ఈ పెట్టుబడుల ప్రధాన లక్ష్యంగా ఉందని తెలిపారు. హ్వాషిన్, సియోన్ సంస్థలు తమిళనాడులో కూడా హ్యుండాయ్ ప్లాంట్ కోసంకార్యకలాపాలను విస్తరించేందుకు రూ.1,370 కోట్ల పెట్టుబడులు ప్రకటించినట్లు తెలిపారు.
కుప్పానికి హ్వాసంగ్.. సత్యవేడుకు రాయల్ ఎన్ఫీల్డ్:
తమిళనాడులో ప్రతిపాదించిన మరో ప్రాజెక్టు కూడా ఏపీకి వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన షూ తయారీ సంస్థ హ్వాసంగ్ తొలుత తమిళనాడులోని తూత్తుకుడిలో సుమారు రూ.1,720 కోట్లతో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని భావించినా, అనంతరం చిత్తూరు జిల్లాలోని కుప్పాన్ని ఎంపిక చేసుకుంది. అయితే ఈ ఒప్పందం తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడకముందే జరిగింది.
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తమిళనాడు వెలుపల తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయించి, తిరుపతి జిల్లాలోని సత్యవేడులో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు కూడా ఏపీకి వచ్చిన ఆటోమొబైల్ రంగ పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు తమిళనాడులోని పారిశ్రామిక సంస్థలను ఆకర్షించేందుకు ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి చెన్నై, కోయంబత్తూరులో పెట్టుబడుల కోసం రోడ్‌షోలు నిర్వహించింది. ఆటోమొబైల్, తయారీ రంగ సంస్థలతో పాటు వస్త్ర పరిశ్రమలకు చెందిన సంస్థలతో సమావేశమై రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పారిశ్రామిక భూములు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి ప్రోత్సాహకాలను వివరించింది. గైడెన్స్ తమిళనాడు నుంచి ఏపీ ఈడీబీలోకి ఉద్యోగుల చేరికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు అస్త్రం దొరికినట్టైంది.
2026 నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) ఏపీ పారిశ్రామిక రంగంలో కొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ₹9.02 లక్షల కోట్ల నుండి ₹10 లక్షల కోట్ల విలువైన 303 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. దీంతో తమిళనాడులో విపక్షాలు అధికార టీవీకే ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టాయి. తమిళనాడుకు రావాల్సిన పరిశ్రమలను ఏపీ ఎగరేసుకుపోయిందని ఆరోపించాయి.
తమిళ రాజకీయాలతో సంబంధం లేదు:
తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులు ఆంధ్రాకు తరలిపోయాయనే ఆరోపణలను ఏపీ ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. తమిళనాడు నుంచి కీలక సమాచారం తరలిపోవడం, పెట్టుబడుల ప్రోత్సాహకాల గురించి ముందే తెలుసుకుని చర్చలు జరపడం వంటి ఉద్యోగుల స్థాయిలో జరగవని స్పష్టం చేస్తున్నారు. విధాన పరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇందులో ఉద్యోగుల పాత్ర ఉండదని చెబుతున్నారు. పెట్టుబడులు, రాష్ట్రానికి దక్కే ప్రయోజనాలు, దీర్ఘకాలిక వ్యూహాలు, ఉపాధి వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని, ఇందులో ఉద్యోగుల స్థాయిలో జరగవని స్పష్టం చేశారు. తమిళనాడు వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అనవసరమని ఏపీ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, విభేదాల నేపథ్యంలో జరుగుతున్న వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు వివరించాయి.