రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా మారిన స్థానిక ఎన్నికలు.. తాడో పేడో..
AP Local Body elections: స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. లోకల్ ఫైట్ లో విజయం సాధించి పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రజల మద్ధతుతో లోకల్ ప్రజాప్రతినిధి కావాలని కలలు కంటున్న వారు ఎన్నికల్లో పోటీకి సమాయత్తమయ్యారు. ఓ రకంగా తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు.
Local body Elections Litmus Test: స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు కొత్త చిక్కు తీసుకొచ్చాయి. అభ్యర్ధులు రాజకీయ పార్టీల తరఫున, లేకుండా ఇండిపెండెంట్ గా పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో పట్టుసాధించేందుకు రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇపుడు ఎన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి? ఏయే పార్టీల పరిస్థితి ఎలా ఉంది? క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు ప్రభావం చూపిస్తాయా? అక్కడ పోటీచేసే అభ్యర్థుల ప్రమేయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
షెడ్యూల్ విడుదల..
ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం షెడ్యూలు విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ముందుగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 123 మున్సిపాలిటీలుంటే.. ఇప్పటికే పదవీకాలం ముగిసిన వంద మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుపబోతున్నారు. మిగిలిన 23 మున్సిపాలిటీలకు మరో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల్లో అంత్యంత కీలకమైన నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.
13 మున్సిపల్ కార్పోరేషన్లు, 87 మున్సిపాలిటీలు..
ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్ లో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి చోటుచేసుకుంది. మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల ప్రచారానికి ఓ వారంరోజులే అవకాశం కల్పించారు. ఈ నెల 28వ తేదీన పోలింగ్ నిర్వహించి, 30వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించే విధంగా అధికార యంత్రాంగం కసరత్తు పూర్తిచేసింది.
ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న వారంతా ముందస్తుగానే ఆయా మున్సిపల్ వార్డుల్లో తిరిగి ప్రజా మద్ధతు కూడగట్టుకుంటున్నారు. రాజకీయ పార్టీలు అభ్యర్థిగా ప్రకటించినా.. ప్రకటించక పోయినా ఎన్నికల పోటీలో ఉంటామనే కాన్ఫిడెన్స్ అభ్యర్థుల్లో కన్పిస్తోంది.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ..
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరిగినప్పటికీ… ఈ ఎన్నికలు మాత్రం పాత ఓటర్ల జాబితాతోనే నిర్వహించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపాలిటీ ఛైర్మన్ పదవులు, మున్సిపల్ డివిజన్లు, మున్సిపల్ వార్డుల్లో రిజర్వేషన్లు కొన్నిచోట్ల ఆశావహుల్ని ఖంగుతినిపించాయి. మగవారు పోటీచేయదలచిన స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు కావడంతో పోటీచేయాలనుకున్న వారిని రిజర్వేషన్లు ఖంగుతినిపించాయి. అన్ రిజర్వుడు స్థానాల్లో రాజకీయ పార్టీ నాయకులు తమ అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
మున్సిపాల్టీలు విస్తరణతో విలీనమైన గ్రామాలతో ఎన్నికల రసవత్తరంగా మారాయి. పంచాయతీలు విలీనమైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సత్తా చాటాలని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
రాజకీయాల్లో కొత్తగా ఎదిగేవాళ్లకు ఓటర్లు అవకాశం ఇవ్వబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తరపోరు జరుగబోతోంది. అసెంబ్లీ ఎన్నికలనాటి తీర్పు, మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతమవుతుందా? అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులనే ఎన్నుకోవాలని చూస్తున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చి దిద్దుకోవాలనుకున్న అభ్యర్థుల ఆకాంక్షలను ఓటర్లు నెరవేర్చబోతున్నారు.