AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఎన్నికల సందడి..నేటి నుంచే నామినేషన్లు ప్రారంభం..ఈసీ కీలక నిర్ణయం!
AP Local Body Elections Nominations: ఆంధ్రప్రదేశ్లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని 100 పుర, నగరపాలక సంస్థలలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను సిద్ధం చేయడమే కాకుండా, ఎన్నికల వ్యయం, రాజకీయ పార్టీలకు గుర్తుల కేటాయింపుపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Local Body Elections Nominations: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లను స్వీకరించడానికి అధికారులు ప్రత్యేకంగా 5,485 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికలు జరిగే స్థానాల వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలతో పాటు మొత్తం 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 28 జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
రాజకీయ పార్టీల గుర్తులు, నిబంధనలు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పర్యవేక్షణలో ఎన్నికల సన్నాహకాలు పూర్తయ్యాయి. ప్రచార ప్రక్రియలో రాజకీయ పార్టీలు ఎలాంటి నియమోల్లంఘనలకు పాల్పడకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. గుర్తుల కేటాయింపుపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, గుర్తింపు పొందిన పార్టీలకు మునుపటి ఎన్నికల్లో ఉన్న గుర్తులనే తిరిగి కేటాయించాలని నిర్ణయించారు.
అభ్యర్థుల వ్యయ పరిమితులు..
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితిని సవరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు ఇచ్చారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ అభ్యర్థికి రూ. 40 లక్షలు, కార్పొరేటర్ అభ్యర్థికి రూ. 15 లక్షలు వ్యయ పరిమితిగా నిర్ణయించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవికి రూ. 25 లక్షలు, కార్పొరేటర్ అభ్యర్థికి రూ. 10 లక్షల పరిమితి ఉంది.
అలాగే మున్సిపాలిటీ చైర్పర్సన్ పోటీదారుకు రూ. 20 లక్షలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్కు రూ. 7.50 లక్షల వరకు వ్యయం చేసేందుకు అనుమతించారు. నగర పంచాయతీ చైర్పర్సన్కు రూ. 10 లక్షలు, వార్డు సభ్యునికి రూ. 5 లక్షలను ఈసీ నిర్దేశించింది. ఈ వ్యయ నిబంధనలను జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఖచ్చితంగా అమలు చేయాలని ఈసీ స్పష్టం చేసింది.