AP New Vande Bharat Trains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రానికి మరో రెండు వందే భారత్ రైళ్లు!
AP New Vande Bharat Trains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణికులకు రైల్వేశాఖ నుంచి త్వరలోనే శుభవార్త అందనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న బెంగళూరు ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ఏపీ మీదుగా రాకపోకలు సాగించనుండగా, గుంతకల్, అనంతపురం స్టేషన్లలో దీనికి హాల్ట్‌లు కేటాయించారు. దీనికితోడు విశాఖపట్నం - బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా మరో సరికొత్త వందే భారత్ స్లీపర్ రైలును నడపాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
AP New Vande Bharat Trains: భారతదేశంలో ఉన్న విశాలమైన రైల్వే నెట్‌వర్క్ ద్వారా సామాన్యులు తక్కువ ఖర్చుతో దేశంలోని వివిధ ప్రాంతాలకు సులభంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండగా, దూరప్రాంత ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
బెంగళూరు - ముంబై వందే భారత్ స్లీపర్..
నవంబర్ 1వ తేదీ నుంచి బెంగళూరు - ముంబై మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుంది. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం గుంతకల్, అనంతపురం రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.
విశాఖపట్నం - బెంగళూరు (తిరుపతి మీదుగా) నూతన వందే భారత్..
ఇది కాకుండా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తుల రద్దీని సీఎం ప్రస్తావించారు. శ్రీవారి దర్శనానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున, వారి సౌకర్యార్థం విశాఖపట్నం - బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని ప్రతిపాదించారు.
దీనితో పాటు పగటిపూట రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం విశాఖపట్నం - తిరుపతి మధ్య మరో అదనపు రైలును అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ రెండు ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి తన సమ్మతిని తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులు
ఈ సమావేశంలో కొత్తగా నిర్మించిన కనిగిరి - విజయవాడ రైల్వే లైన్‌లో రైలు సేవలను త్వరితగతిన ప్రారంభించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని పోర్టుల నుంచి సరుకు రవాణాను మరింత సులభతరం చేయడం, తూర్పు - పశ్చిమ ప్రాంతాల మధ్య రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి.