AP Telangana Voter List Schedule News: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పునఃపరిశీలించి మార్పులు చేసింది. రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈవోలు) విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
తాజా మార్పుల ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా నవంబర్ 30న ప్రచురితం కానుంది. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులపై వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కార గడువును కూడా ఈసీ పొడిగించింది. దీని ప్రకారం తెలంగాణలో నవంబర్ 26 వరకు, ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 20 వరకు గడువు పొడిగించారు.
గతంలో ప్రకటించిన పాత షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో నవంబర్ 9న, ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 30నే తుది జాబితా వెలువడాల్సి ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో సీఈవోలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈసీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన షెడ్యూల్ వివరాలను క్షేత్రస్థాయి అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు రాతపూర్వకంగా తెలియజేయాలని, మీడియా ద్వారా ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఈసీ ఆదేశించింది.
రెండు రాష్ట్రాల్లో ఓటర్ల పరిశీలన గణాంకాలను పరిశీలిస్తే, ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,64,87,213 మంది మాత్రమే తమ వివరాలను నమోదు చేసుకున్నారు. వలస వెళ్లినవారు, మరణించినవారు, చిరునామా మారినవారు, నకిలీ ఓట్ల (ASDD) కేటగిరీ కింద గుర్తించి 73,39,235 మందిని డ్రాఫ్ట్ జాబితా నుండి తొలగించారు.
అక్టోబర్ 29 నాటికి తెలంగాణలో జారీ చేసిన 92,88,188 నోటీసులలో 92,81,189 నోటీసులు ఓటర్లకు అందగా, 92,08,443 నోటీసులపై విచారణ పూర్తయింది. ఇందులో 2,59,22,684 మంది ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చడానికి అధికారులు ఆమోదం తెలిపారు.
అలాగే, తెలంగాణలో 59,31,395 మంది ఓటర్లకు సంబంధించి ఉన్న సాంకేతిక సమస్యలను అధికారులు పరిష్కరించారు. మరో 30,64,168 మంది ఓటర్లను 2002 నాటి జాబితా నుంచి మ్యాపింగ్ చేయగా, విచారణ అనంతరం 50,690 మంది నిబంధనల ప్రకారం అర్హులు కారని తేల్చారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఓటర్ల జాబితా సవరణలో భాగంగా మొత్తం 44,28,858 నోటీసులపై విచారణ పూర్తిచేశారు. పరిశీలన అనంతరం 42,55,630 మంది ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చడానికి ఆమోదం తెలపగా, 1,73,662 మంది ఓటర్లు జాబితాలో చేరడానికి అనర్హులని అధికారులు స్పష్టం చేశారు.