AP Ward Secretariat Employees Promotions: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ఏడు సంవత్సరాలుగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు ప్రభుత్వం నుంచి లభించాల్సిన ప్రయోజనాలు, తగిన సౌకర్యాలు అందడం లేదని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయా ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది.
అయితే తాజాగా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజయవాడ నగరం వేదికగా ఉద్యోగులు భారీ ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, రాష్ట్ర నలుమూలల నుండి సచివాలయ సిబ్బంది అత్యంత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడలో ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని ఆంక్షలు విధించినా ఉద్యోగులు తమ నిరసనను కొనసాగించారు.
ఈ ఆందోళనల తీవ్రత, ఉద్యోగుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రమోషన్లపై సానుకూల నిర్ణయం తీసుకుంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీవో ఎంఎస్ నంబర్ 244 రూపంలో అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. పురపాలక పరిపాలన శాఖలో లభ్యమయ్యే మిగులు పోస్టులను పునర్వ్యవస్థీకరించి కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సృష్టించారు.
మొదటి దశలో అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు ఈ నూతన జూనియర్ అసిస్టెంట్ పోస్టులలోకి ప్రమోషన్లు కల్పిస్తారు. ఆ తదనంతరం ఖాళీ అయ్యే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ స్థానాల్లోకి వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు పదోన్నతులు ఇవ్వనున్నారు.
వీటితో పాటు అదనంగా, వార్డు సచివాలయ వ్యవస్థలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న 815 వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) పోస్టులను గ్రేడ్-I స్థాయికి ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 815 వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) పోస్టులను కూడా గ్రేడ్-I హోదాకు పెంచుతూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై పైసా కూడా అదనపు ఆర్థిక భారం పడకుండానే ఈ సమగ్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంతో వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతుల మార్గం సుగమమై ఉద్యోగ భద్రత, వృత్తిపరమైన ఎదుగుదల సాధ్యం కానుంది.