SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Arnab Cyclone Update: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్ణబ్ తుఫాను..రైతులు, ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు!

Arnab Cyclone Update In AP: బంగాళాఖాతంలో బలపడుతున్న 'అర్ణబ్' తుఫాను తీవ్రరూపం దాల్చుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు, పశుపోషకులు, ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ తుఫాను ఈ నెల 28వ తేదీన బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున, పంట నష్టాన్ని నివారించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

Written By Harish Darla
Published: Oct 26, 2026, 04:22 PM IST | Updated: Oct 26, 2026, 04:30 PM IST
Join

Arnab Cyclone Update In AP: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అర్ణబ్ తుఫాను తీవ్ర తుఫానుగా మారి, తదుపరి అత్యంత తీవ్ర తుఫానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఇది 28వ తేదీ ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ - యానాం పరిసరాల్లో తీరాన్ని దాటవచ్చని అంచనా వేస్తున్నారు. 

తీరం దాటే వేళ గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వరకు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాగల రెండు రోజుల్లో విస్తారంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు, మత్స్యకారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

పంటల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు..
తుఫాను ప్రభావం వల్ల పంటలకు వాటిల్లే నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు రైతులు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలి. వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుధాన్యాల వంటి పంటలు కోత దశలో ఉంటే వాతావరణం అనుకూలించిన వెంటనే కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తడవకుండా టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలి. 

పొలాల్లో నీరు నిలవకుండా మురుగు కాలువలను శుభ్రం చేయాలని, వర్షాలు కురిసే సమయంలో ఎరువుల పైపూత గానీ, పురుగుమందుల పిచికారీ గానీ పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. అరటి, బొప్పాయి చెట్లకు ఊతకర్రలు వేయడంతో పాటు తీగజాతి పందిళ్లను పటిష్ఠం చేసుకోవాలి.

తుఫాను అనంతర మార్గదర్శకాలు
విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల బస్తాలను ఎత్తైన గట్లపై లేదా గదుల్లో భద్రపరచాలి. ట్రాక్టర్లు, మోటార్లు, డ్రిప్ పరికరాలు వరద నీటిలో మునిగిపోకుండా రక్షించుకోవాలి. తుఫాను తగ్గిన వెంటనే పొలాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించి, చీడపీడల ఉధృతిని గమనించి ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సలహా మేరకే చర్యలు తీసుకోవాలి. 

పంటలు, పశువుల షెడ్లకు నష్టం వాటిల్లితే ఫొటోలు, పత్రాలను భద్రపరచుకుని అధికారులకు, బీమా సంస్థలకు నిబంధనల ప్రకారం తెలియజేయాలి. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES