Bhogapuram Airport Bus Pass: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్..10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం..ఆ ఊర్లో మాత్రమే?
Bhogapuram Airport Bus Pass Price: విశాఖపట్నం నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఒక అద్భుతమైన రాయితీ ఆఫర్‌ను ప్రకటించింది. విశాఖ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేకంగా నడుపుతున్న 'ఏరో ఏసీ ఎక్స్‌ప్రెస్' బస్సుల్లో ప్రయాణించే వారి కోసం కేవలం 10 రోజుల ప్రయాణ ఛార్జీ చెల్లిస్తే చాలు, ఏకంగా 30 రోజుల పాటు ప్రయాణించేలా సరికొత్త నెలవారీ సీజన్ పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Bhogapuram Airport Bus Pass Price: విశాఖపట్నం, భోగాపురం ఎయిర్‌పోర్ట్ మధ్య నిత్యం ప్రయాణించే ప్రయాణికులు, ఉద్యోగులకు ఈ నెలవారీ సీజన్ పాస్ ఆఫర్ ఎంతో అనుకూలంగా, ఆర్థికంగా ఊరటనిచ్చేలా ఉంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక పాస్‌లను సులభంగా పొందేందుకు వీలుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని అరైవల్ బ్లాక్ వద్ద ప్రత్యేకంగా ఒక కౌంటర్‌ను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. దీనితో పాటు విశాఖపట్నంలోని ప్రధాన బస్టాండ్లలో కూడా ఈ నెలవారీ పాస్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
బస్సు సర్వీసులు, రూట్లు (షెడ్యూల్)..
ప్రస్తుతం విశాఖపట్నం నగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మొత్తం 20 ఏరో ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. పాత గాజువాక నుంచి నేషనల్ హైవే (జాతీయ రహదారి) మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిరోజూ 10 ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుస్తున్నాయి. పాత గాజువాక నుంచి బీచ్ రోడ్డు మీదుగా నగరంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లకు మరో 10 బస్సులు సేవలు అందిస్తున్నాయి
ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులు, ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా పక్కాగా షెడ్యూల్ ఖరారు చేశారు.
బోర్డింగ్ పాయింట్ల ఆధారంగా బస్ పాస్ ధరల వివరాలు..
బోర్డింగ్ పాయింట్‌ను బట్టి బస్ పాస్ చార్జీల ధరలను ఆర్టీసీ ఈ క్రింది విధంగా నిర్ణయించింది.
గురుద్వారా నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్: రూ. 6,000
ఐటీ హిల్స్ నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్: రూ. 5,000
ఆనందపురం నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్: రూ. 3,000
ఎయిర్‌పోర్ట్ జంక్షన్ నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్: రూ. 1,000
జనరల్ బస్ పాస్ ధర: రూ. 7,000 గా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనికి తగినట్లుగా ప్రభుత్వం రహదారులను అభివృద్ధి చేసి, అధునాతన మౌలిక వసతులను కల్పించింది. ఆర్టీసీ అందించే ఈ సీజన్ పాస్ ఆఫర్ వల్ల ఉద్యోగులకు, ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.