SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Raptadu School Incident: రాప్తాడు పాఠశాల ఘటనపై చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Chandrababu And YS Jagan Big Shocked On Raptadu School Incident: పాఠశాలలో ఉన్మాది రంపంతో అరాచకం సృష్టించడంతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ ఘోర సంఘటనపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తదితరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ఉన్మాదిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 31, 2026, 03:54 PM IST | Updated: Oct 31, 2026, 04:07 PM IST
Image Credit: Raptadu School Incident Deep Shock
Join

Raptadu Student Incident: అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలో రంపంతో అత్యంత అనుమానుషంగా దాడి చేయడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి సీఎం అధికారులతో మాట్లాడారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

బాలిక తల్లితో ఫోన్‌లో భరోసా
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్మాది దాడికి గురైన పదో తరగతి విద్యార్ధిని తల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలిఫోన్‌లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. ఆ విద్యార్థిని ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేద్దామని, ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థినికి అందుతున్న వైద్యం సాయంపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఉన్మాది దాడిలో గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

చంద్రబాబుదే బాధ్యత: వైఎస్‌ జగన్‌
'రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై ఏకంగా తరగతి గదిలోనే పిల్లలంతా చూస్తుండగానే అత్యంత అనాగరికంగా రంపంతో జరిగిన దాడి రాష్ట్రంలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు జంగిల్‌రాజ్‌కు అద్దం పడుతోంది. ఒక దుండగుడు యథేచ్ఛగా ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడి తరగతి గదిలో బాలికపై ఇంత దారుణంగా ఎలా దాడి చేయగలిగాడు? విద్యా సంస్థల్లో పిల్లలకు తగిన భద్రత కల్పించడంలో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ఈ ఘటన ఒక  నిదర్శనం. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడటం అత్యంత దురదృష్టకరం. పాలనను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపులు, ‘రెడ్‌ బుక్‌’ పాలనకే ప్రాధాన్యం ఇస్తే, నేరస్తులు ఇలాగే చట్టమంటే ఏ మాత్రం భయం లేకుండా చెలరేగిపోతారు. గాయపడిన విద్యార్థినులకు అత్యుత్తమ వైద్య సేవలందించాలి. వారి కుటుంబ సభ్యులకు పూర్తి భరోసా కల్పించాలి. దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, పారదర్శక దర్యాప్తు ద్వారా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల భద్రతా విధానాలను అత్యవసరంగా సమీక్షించాలి. ఈ ఘటనకు చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలి' అని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోస్టు చేశారు.

డిప్యూటీ సీఎం ప్రకటన
రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై  ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చొరబడి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదని స్పష్టం చేశారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ ఘటనపై అనంతపురం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బాధితురాలికి అవసరమైన వైద్య సహాయం మెరుగైన రీతిలో అందించాలని కోరారు. గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు.

కఠినంగా శిక్షిస్తాం: హోంమంత్రి
పాఠశాలలో ఉన్మాది బాలికపై రంపంతో దాడి చేసిన ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. 'రాప్తాడులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిపై రంపంతో దాడి చేయడం అత్యంత పాశవికం, క్షమించరాని నేరం. బడికి వెళ్లిన ఆడబిడ్డలపై ఇలాంటి దాడులకు తెగబడటం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తాం. బాధిత బాలికలకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఆడబిడ్డల భద్రత విషయంలో రాజీ లేదు!' అని వంగలపూడి అనిత తెలిపారు.

నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి
'చిన్నారి చెల్లిని క్లాస్ రూమ్‌లో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు' అని నారా లోకేశ్‌ పోస్టుచేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES