SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Cyclone Compensation AP: తుఫాను బాధితులకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం..రోజుకు రూ.1,000..మృతులకు రూ.5 లక్షలు!

Arnab Cyclone Compensation AP: అర్నాబ్ తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించారు. తుఫాను అనంతర సమీక్ష నిర్వహించిన సీఎం, నష్టపోయిన చివరి వ్యక్తికి కూడా పారదర్శకంగా న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు తక్షణ నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం, జీవనోపాధికి చేయూత, పంటలు, పశువుల నష్టపరిహారాన్ని వేగంగా అందించి వారిని నిలబెడతామని స్పష్టం చేశారు.

Written By Harish Darla
Published: Oct 29, 2026, 07:47 AM IST | Updated: Oct 29, 2026, 07:56 AM IST
Join

Arnab Cyclone Compensation AP: ఆంధ్రప్రదేశ్‌లోని అర్నాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. తీరప్రాంతాల్లోని మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం కేటాయించారు. వీటితో పాటు ప్రతి కుటుంబానికి కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ చక్కెర, కేజీ బంగాళదుంపలు అందించనున్నారు.

అలాగే తుఫాను నుంచి తక్షణ అత్యవసర ఖర్చుల కోసం రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు ఆర్థిక సహాయం ఇస్తారు. పాక్షికంగా ఇల్లు దెబ్బతింటే రూ. 10,000 ఇవ్వనుండగా, తుపాను కారణంగా మరణించిన ఐదుగురి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

వ్యాపారాలు, జీవనోపాధి పునరుద్ధరణ..
చిన్న వ్యాపారులు, చేతివృత్తుల వారి జీవనోపాధి దెబ్బతిన్నందున వారికి తగిన సహాయం ఖరారు చేశారు. చిన్న కిరాణా షాపులు, రెస్టారెంట్లు, సర్వీస్ షాపులు, చేతివృత్తుల వారికి రూ. 25,000 చొప్పున సహాయం అందించనున్నారు. తోపుడు బండ్లకు రూ. 20,000, దెబ్బతిన్న ద్విచక్ర వాహనానికి రూ. 3,000, ఆటోకు రూ. 10,000 పరిహారం ఇస్తారు.

అలాగే ఎంఎస్ఎంఈ పరిశ్రమల టర్నోవర్ ప్రాతిపదికన రూ. 50,000 నుండి రూ. 1,50,000 వరకు సహాయం అందిస్తారు. మత్స్యకారుల బోట్లు, వలల నష్టానికి రూ. 5,000 నుంచి రూ. 25,000 వరకు సాయం అందించడంతో పాటు చేపల చెరువుల పునరుద్ధరణకు రూ. 18,000 కేటాయించారు. పశునష్టం కింద ఆవు లేదా గేదెకు రూ. 50,000, దూడలకు రూ. 25,000, గొర్రె లేదా మేకకు రూ. 7,500 అందిస్తారు.

వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టపరిహారం..
పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం హెక్టారుకు నిర్ణీత పరిహారం ప్రకటించింది. తమలపాకు పంటకు హెక్టారుకు రూ. 75,000, అరటి, మిరప, మామిడి, పసుపు, జామ మొదలైన పంటలకు రూ. 35,000 ఇస్తారు. వరి, పత్తి, వేరుశనగ, కూరగాయలు, టమాటో పంటలకు హెక్టారుకు రూ. 25,000, మినుములు, పెసలు, మొక్కజొన్న తదితర ధాన్యాలకు రూ. 15,000 అందిస్తారు. ఆయిల్ పామ్, కొబ్బరి చెట్లకు ఒక్కో దానికి రూ. 1,500 పరిహారం నిర్ణయించారు.

పునరుద్ధరణ చర్యలు, భవిష్యత్ ప్రణాళిక.. 
తుఫాను వల్ల సంభవించిన ప్రాణనష్టం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తుఫాను ధాటికి దాదాపుగా 9 మంది మృతి చెందినట్లు సమాచారం. అధికారులు టెక్నాలజీని ఉపయోగించి తక్షణమే స్పందించడం వల్ల పెద్ద ఎత్తున నష్టం తగ్గించగలిగామని తెలిపారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణాను వేగంగా పునరుద్ధరిస్తున్నామని, విద్యుత్ సరఫరాను రెండు మూడు రోజుల్లో పునరుద్ధరిస్తామని చెప్పారు. నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపినట్లు, క్షేత్రస్థాయి పర్యటన ద్వారా ప్రజల్లో ధైర్యం నింపుతామని సీఎం భరోసా ఇచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES