Kanakambaram Cultivation: సాంప్రదాయ పూల సాగులో కనకాంబరానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఈ పంట నిరంతర ఆదాయాన్ని అందించే ఉత్తమ మార్గంగా నిలుస్తోంది. ఇదే బాటలో పయనిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన రాంబాబు అనే రైతు కనకాంబరం సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజమండ్రి దగ్గరలోని మారంపూడి నుంచి మొక్కలను తీసుకువచ్చి.. 25 సెంట్ల భూమిలో సాగు చేస్తున్నారు. సువాసన లేకపోయినా.. ఎరుపు రంగులో ఉండే ఈ పువ్వులకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఈ పంటను సాగు చేస్తున్నారు. పంట కోతకు వచ్చిన తర్వాత ప్రతి రోజూ లేదా మార్చి రోజు పూల కోత కోయవచ్చు. అయితే సాధారణ రోజుల్లో కిలో పువ్వులు 600 నుంచి 700 రూపాయల వరకు పలుకుతాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్లలో మాత్రం 1500 నుంచి 1700 వరకు పలుకుతుంటాయి. ఈ విధంగా పెళ్లిల సమయంలో వచ్చే ఆదాయంతో పాటు 50వేల వరకు కౌలు రైతుకు మిగులుతుందని రాంబాబు సంతోషంగా చెబుతున్నారు.
మొక్కల సాగులో మెళకువలు:
మొక్కలు నాటే సమయంలో కొన్ని మెళకువలు పాటించాలి. సెంట్ భూమికి 300 నుంచి 3500 వరకు ఖఱ్చు అవుతుంది. ఒకేసారి నాటితే.. ఏడాది పొడవునా దిగుబడి పొందవచ్చు. 25 సెంట్ల భూమి నుంచి రోజు మార్చి రోజు 1.5 నుంచి 2 కిలోల వరకు దిగుబడి లభిస్తుంది. అయితే పంట బాగా రావాలంటే వారానికి ఒకటి లేదా రెండుసార్లు నీటి తడి తప్పకుండా అందించాలి.
ఎరువు విషయంలో జాగ్రత్తలు:
కనకాంబరం మొక్కలకు ఎరువులు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాంప్లెక్స్, డీఏపీ, 10-26, 20-20 వంటి ఎరువులను వాడాలి. యూరియాను మాత్రం పొరపాటున కూడా మొక్కలకు వేయకూడదు. ఆముదం పిండి, వేప పిండి వంటి సేంద్రీయ ఎరువులను కూడా వాడుకోవచ్చు. పురుగుల మందుల కోసం ప్రతి ట్రిప్పుకు 1000 నుంచి 1500 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతు రాంబాబు చెబుతున్నారు.
అయితే కాంప్లెక్స్ ఎరువుల ధర 1500 నుంచి 1700 వరకు పలుకుతోంది. ప్రభుత్వం నుంచి కొంత ప్రోత్సాహం అందితే బాగుంటుందని రైతులు కూడా కోరుకుంటున్నారు. వర్షాలు 2 నుంచి 4 రోజులు పడితే.. మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుందని అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు చెబుతున్నారు.
మార్కెట్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి కాబట్టి...ఒక రోజు రూ. 2,000 నుండి రూ.3,000 వరకు ధర పలికే పువ్వులు మరుసటి రోజు రూ.1,000 లేదా రూ.500కి పడిపోవచ్చు. అయితే, కార్తీక మాసం... పెళ్లిళ్ల సీజన్ వంటి ప్రత్యేక సందర్భాలలో, 4 కిలోల పూలు కోసినా కూడా పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవచ్చు. రైతులు ఈ పూలను విజయవాడ మార్కెట్‌కు రవాణా చేయడం ద్వారా మంచి ధరను పొందుతున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ ధరల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, కనకాంబరం సాగు ఒక నమ్మకమైన ఆదాయ వనరుగా నిలుస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పంటను ఎంచుకోవడం వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని అందిస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులతో, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. ప్రభుత్వ మద్దతు ఈ సాగును మరింత లాభదాయకంగా మార్చి, రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.
Also Read: