SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

YS Jagan 9 Hours Review On Local Body Elections With YSRCP Leaders: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకపోవడం.. పాలన వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. చంద్రబాబు వైఫల్యాలు, మోసాలను ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 01, 2026, 10:55 PM IST | Updated: Oct 01, 2026, 11:05 PM IST
Image Credit: YS Jagan Meet To YSRCP Leaders
Join

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు వైఎస్సార్‌సీపీకే ఉందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలను సాఫీగా జరిపించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని తెలిపారు. చంద్రబాబు మోసాలు, దౌర్జన్యాలు, కుంభకోణాలు అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ప్రతి వర్గం కూడా చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని వివరించారు. స్థానిక ఎన్నికలను సజావుగా జరిపే ఆలోచన చంద్రబాబుకు లేదని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే దిశగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎ‌స్‌ జగన్‌ విస్తృత కసరత్తు చేపట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశాలు రాత్రి 8 గంటల వరకు ఏకధాటిగా దాదాపు తొమ్మిది గంటలు కొనసాగాయి. ఒక్కో జిల్లా పరిస్థితిని విడివిడిగా సమీక్షించిన ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ క్షేత్రస్థాయిలో పార్టీ బలం, ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై పార్టీ నాయకత్వంతో విస్తృతంగా చర్చించారు.

వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పాలన, స్థానిక సమస్యలు తదితర అంశాలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వైఎస్‌ జగన్‌ దృష్టికి పార్టీ నాయకులు తీసుకువచ్చారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బెదిరింపులు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం కొనసాగుతోందని చెప్పారు. ఎన్నికల్లో పోటీకి అవసరమైన సర్టిఫికెట్ల జారీలో కూడా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను బెదిరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. ప్రభుత్వంపై నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక విపక్షంపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, పోలీసు బలాన్ని ఉపయోగిస్తున్నారని పార్టీ నాయకులు వైఎస్‌ జగన్‌ ముందు ప్రస్తావించారు.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు ధైర్యంగా నిలబడాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు అండగా నిలవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక పరిస్థితులు.. ప్రజాదరణ, వైఎస్సార్‌సీపీ నిబద్ధత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక జరగాలని వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES