Pawan Kalyan: బీ-ఫామ్ లేకుంటే పోటీ నుంచి తప్పుకోండి.. కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
Pawan Kalyan on Local Body Elections: ఎన్నికల బరిలో బీ-ఫామ్ ఉన్నవారే బరిలో ఉండాలని.. మిగిలిన వారు తక్షణమే తప్పుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో అందరికీ సర్ది చెప్పేందుకు సీఎం చంద్రబాబు చాలా కష్టపడ్డారని చెప్పారు.
Pawan Kalyan on Local Body Elections: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కేవలం ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలు, కార్యకర్తలు పూర్తి ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన ఎన్డీయే కూటమి అగ్రనేతల సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి సాధించిన అపూర్వ విజయాన్ని గుర్తుచేస్తూ.. అదే గెలుపు స్ఫూర్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాటి గ్రామీణ స్థాయి అభివృద్ధికి బలమైన పునాది వేయాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు భిన్నమైన సిద్ధాంతాలు, నేపథ్యాలు కలిగిన పార్టీలు అని అన్నారు. టీడీపీకి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని.. బీజేపీ సంస్థాగతంగా అపార బలం ఉన్న పార్టీ అని చెప్పారు. జనసేన గత పదేళ్లుగా రాజీలేని పోరాటాలతో ప్రజల పక్షాన నిలబడిందన్నారు.
"ఇలాంటి మూడు పార్టీలు కలిసిన చోట సహజంగానే కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పోటీ చేసే ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ సర్దిచెప్పేందుకు తీవ్రంగా శ్రమించారు. నాయకులంతా కూర్చుని ఏకాభిప్రాయంతో అభ్యర్థుల జాబితాను ఖరారు చేశాం. కాబట్టి అధికారికంగా బీ-ఫామ్ పొందిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండాలి. నామినేషన్లు వేసిన మిగిలిన వారు విత్ డ్రా చేసుకుని సహకరించాలి. వారికి భవిష్యత్తులో ప్రభుత్వం, కూటమి అండగా ఉంటుంది. ఎక్కడా కూటమి స్ఫూర్తి దెబ్బతినకుండా, విజయానికి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలి" అని పవన్ కళ్యాణ్ సూచించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ఆర్థిక, పరిపాలనాపరమైన సవాళ్లను ఎదుర్కొన్నామని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలను సైతం దారి మళ్లించిన దుస్థితి ఉండేదని, అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వంలో నేడు దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే రావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నిలిచిపోయిన పోలవరం, హంద్రీనీవా, భోగాపురం ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. జల్ జీవన్ మిషన్ కింద గత పాలకుల నిర్లక్ష్యంతో ఆగిపోయిన పనులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2028 వరకు పొడిగించామని.. రూ.30,156 కోట్లతో 50,300 పనులను చేపడుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు అందించి, మొత్తం 3.27 కోట్ల గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమన్నారు.
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ మౌలిక వసతుల కోసం రూ.20,397 కోట్లు కేటాయించామని, ఇప్పటికే దాదాపు 9,000 కి.మీల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మరో 19,500 కి.మీల బీటీ రోడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. మినీ గోకులాలు, పశువుల తొట్టెలు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి గ్రామీణ ఆస్తుల కల్పన వేగవంతంగా సాగుతోందన్నారు. గిరిజన ప్రాంతాల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తూ రెండు దశల్లో రూ.3,458 కోట్లతో 3,638 కిలోమీటర్ల రోడ్లు, 45 వంతెనల నిర్మాణాలు చేపట్టామని, దీనివల్ల 2,199 గిరిజన ఆవాసాలకు రహదారి సౌకర్యం లభిస్తుందని తెలిపారు.