Cyclone Murasu: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు తుఫాన్లు రావడంతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తుఫాన్ల ధాటికి తీవ్రస్థాయిలో ఈదురుగాలులు, భారీ వర్షాలు పడి ఏపీలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. అర్నాబ్, మురసు తుఫాన్లు రాగా.. వీటిని ఏపీ ప్రభుత్వం ధైర్యంగా ఎదుర్కొని సాధ్యమైనంత వరకు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రాణ నష్టం సంభవించకుండా.. ఆస్తి నష్టం జరగకుండా.. రైతుల పంటలు కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం వీలైనన్నీ చర్యలు చేపట్టింది. ఈ చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఫోన్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో అర్నాబ్, మురసు తుఫాన్లు రావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుఫాన్ల రావడంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్నాబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. తుఫాన్‌ల కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచాయని.. దీని కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. రహదారులు, విద్యుత్ సరఫరాతోపాటు వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ప్రధాని మోదీకి చెప్పారు.
వరుస తుఫాన్ల ధాటికి ఏపీలో తీవ్ర నష్టం ఏర్పడిందని.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక తుఫాన్ సహాయక చర్యలు ఆరా తీసిన ప్రధాని మోదీ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు తెలుసుకున్న అనంతరం అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. నిరంతర అప్రమత్తతతో తుఫాన్‌తో ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారంటూ సీఎం చంద్రబాబుపై ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి వీలైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం.
మురసు తుఫాన్‌తో ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఏపీ ప్రభుత్వం పూర్తి దృష్టి సారించింది. మురసు తుఫాన్‌తో ఏర్పడిన పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ చేపట్టనున్నారు. తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లోని తుఫాన్ నష్టాన్ని పరిశీలించి అంచనా వేయనున్నారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలపై అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశించనున్నారు.