AP PRC Commissioner Salary: ఆంధ్రప్రదేశ్ 12వ పీఆర్సీ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నియామక నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఖరారు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) జీవో జారీ చేసింది. కమిషనర్‌గా ఆయనకు నెలకు రూ.2.25 లక్షల స్థిర వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంజూరు చేసే డీఏ పొందేందుకు దినేష్ కుమార్ అర్హులని తెలిపింది. అయితే తిరిగి నియామకమైన కాలంలో ఆయన తన పెన్షన్‌పై డీఆర్ పొందడానికి అర్హత ఉండదని తెలిపింది. హెచ్‌ఆర్‌ఏ విషయంలో అపెక్స్ స్కేల్ (ఫిక్స్‌డ్ గ్రేడ్) అధికారులకు వర్తించే నిబంధనలే ఆయనకు వర్తిస్తాయని పేర్కొంది.
సెలవుల విషయంలోనూ అదే స్థాయి అధికారులకు వర్తించే నిబంధనలను అనుసరించనున్నారు. ఏపీ లీవ్ రూల్స్‌లోని నిబంధనలు, అవసరమైన సడలింపుల ప్రకారం సెలవులు మంజూరు చేస్తారు. వైద్య సదుపాయాలకు సంబంధించి 1954 నాటి ఆల్ ఇండియా సర్వీసెస్ మెడికల్ అటెండెన్స్ రూల్స్‌తో పాటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలు వర్తిస్తాయి.
అలాగే రాష్ట్రంలో.. రాష్ట్రం వెలుపల పర్యటనలకు వెళ్లినప్పుడు అపెక్స్ స్కేల్ అధికారులకు వర్తించే ఏపీ ట్రావెలింగ్ అలవెన్స్ నిబంధనల ప్రకారం ప్రయాణ, దినసరి భత్యాలు పొందేందుకు ఆయనకు అర్హత ఉంటుంది. ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ కూడా అంగీకారం తెలిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో అక్టోబర్ 1న జారీ చేసిన జీవో ద్వారా దినేష్ కుమార్‌ను 12వ పీఆర్సీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఆయన వేతనం, ఇతర సదుపాయాలు, నియామక నిబంధనలపై స్పష్టతనిచ్చింది.
ఏపీ ప్రభుత్వం 2023 జులై 12న 12వ పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కమిషనర్‌గా నియమించింది. అయితే ఆయన 2024లో రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌ను 12వ పీఆర్సీ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది.
ప్రస్తుతం దినేష్ కుమార్‌కు సంబంధించిన నియామక నిబంధనలు మాత్రమే ప్రభుత్వం ఖరారు చేసింది. ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలి..? కొత్త వేతనాలు ఎంత ఉండాలి..? ఎప్పటి నుంచి అమలు చేయాలనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. కమిషన్ నివేదిక, దానిపై ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తర్వాతే ఈ వివరాలపై క్లారిటీ రానుంది.