Vaibhav Sooryavanshi Century: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలన ప్రదర్శన చేశాడు. గ్రౌండ్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఈ యువ సంచలనం.. ఈసారి ఏకంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దోహా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఈ అద్భుతం చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. దీంతో భారత్ ఎ జట్టు ముందు 250 పరుగుల లక్ష్యం నిలిచింది.
లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొదట 16 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న వైభవ్.. ఆ తరువాత 12 బంతుల్లోనే మరో 50 బాదేసి.. శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటివరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ పేరిట ఉండేది. 2023లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇప్పుడు వైభవ్ 28 బంతుల్లోనే సెంచరీ చేయడంతో ఆ రికార్డు కనుమరుగైంది. గతంలోనూ యూఏఈపైనే రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో 32 బంతుల్లో సెంచరీ చేసి 42 బంతుల్లో 144 పరుగులు సాధించాడు. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ తన సత్తా చాటుతూ మరో చారిత్రక ఘనతను అందుకున్నాడు.
ఫాస్టెస్ట్ సెంచరీల జాబితా..