SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sajjala: ఎన్నికల్లో దౌర్జన్యకాండ.. మున్సిపల్‌ ఎన్నికలు రద్దు చేయాలని సజ్జల సంచలన డిమాండ్‌

Sajjala Ramakrishna Reddy Demands Municipal Elections Cancel: అక్రమాలు, దౌర్జన్యాలతో జరిగిన ఏపీ మున్సిపల్‌ ఎన్నికలను రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. తొలి దశ మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 01, 2026, 07:59 PM IST | Updated: Nov 01, 2026, 08:03 PM IST
Image Credit: Source: Sajjala Ramakrishna Reddy Facebook
Join

AP Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల్లో దౌర్జన్యకాండ కొనసాగడం.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం లేదని తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఏకంగా ఆ ఎన్నికలను రద్దు చేయాలని సంచలన డిమాండ్‌ చేసింది. మున్సిపల్‌ ఎన్నికలను రద్దు చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అధికార వ్యవస్థలు, పోలీసు శాఖ, ఎన్నికల సంఘం దుర్వినియోగమైందని.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీలో జరిగిన మొదటి విడత మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలను భయాందోళనలకు గురిచేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల మండిపడ్డారు.

'మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రారంభం నుంచి వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. అభ్యర్థులు పోటీలో ఉన్నా కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలను చించివేత, అడ్డంకులు సృష్టించారు' అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పోలీసుల సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని.. చివరికి నామినేషన్ల పరిశీలనలోనూ దరఖాస్తులను అన్యాయంగా తిరస్కరించారని తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు, బైండోవర్లు, గంజాయి కేసులు నమోదుచేశారని.. కిడ్నాప్‌లకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వంపై ఆరోపించారు. దౌర్జన్యకాండతో తమ పార్టీ అభ్యర్థులు దాదాపు 1,500 మంది నామినేషన్లు వేయలేకపోయారని సజ్జల వెల్లడించారు.

పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడులు జరిగాయని.. అయినా కూడా పోలీసులు ఏం చేయలేదని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పులివెందులతోపాటు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో వ్యవస్థలన్నింటినీ రంగంలోకి దించి అరాచకాలను నడిపారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలపై 100కు పైగా ఫిర్యాదులు చేసినా కూడా ఎన్నికల సంఘం, పోలీస్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ప్రజాదరణ లేక చంద్రబాబు అక్రమాలు.. నాటకాలు ఆడారని మండిపడ్డారు. ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

'సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని.. సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదు. ఒత్తిళ్లు, బెదిరింపులకు తట్టుకుని నిలబడి పోరాడిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ రోజు కేంద్రాల్లోకి రానివ్వలేదు' అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కడపలో 361 పోలింగ్ బూతులకు గాను 360 బూతుల్లో తమ ఏజెంట్లను పోలీసులు ముందే అడ్డుకున్నారని ఆరోపించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బహిరంగంగా దొంగ ఓట్లు వేయించారని, విచ్చలవిడిగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES