Adilabad Rythu Garjana: 'రైతు డిక్లరేషన్ హామీలు అమలు చేయడం లేదు. తెలంగాణలో నీళ్లు బంద్, కరెంట్ బంద్, పథకాలు బంద్. యాసంగి పంటలు పండించవద్దని చెప్పే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 'యాసంగి పంట వేస్తే ఆ తప్పు నాది ప్రభుత్వానిది కాదని రైతులతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి.. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దివాళా గాడు, దుర్మార్గుడు రేవంత్ రెడ్డి' అని తీవ్ర విమర్శలు చేశారు.
ఆదిలాబాద్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రైతు గర్జన సభలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు చెబుతూ.. కేసీఆర్ హయాంలో రైతులు ఎలా ఉన్నారో గుర్తుచేశారు. 'రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు. రాహుల్ గాంధీ 4 ఏళ్ల వరంగల్ జిల్లాలో హామీలు ఇచ్చారు... ఒక్కటి అమలు కావడం లేదు. రాష్ట్రంలో రాజ్యమేలుతుంది రాబందు. నా రాజ్యంలో వ్యవసాయం చేస్తే జరిమానా అంటూ సీఎం ఫర్మానా జారీ. 3 సార్లు రైతు బంధు ఎగోటైన దివానాగాడు ఎవరు? ఒక దిక్కు దీపావళి.. మరోపక్క రైతు దివాలా' అని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన రైతుబంధు కేసీఆర్ అని గుర్తుచేశారు. రైతు పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని కేసీఆర్ చెప్పిన మాటలు రైతులు గుర్తు తెచ్చుకోవాలని కేటీఆర్ సూచించారు.
'మోటార్లు కాలుడు, స్టార్టర్లు కాలుడు, ట్రాన్స్ ఫార్మర్లు కాలుడు ప్రారంభమైంది. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది కాలం తెచ్చింది కాదు' అని పునరుద్ఘాటించారు. 'కాళేశ్వరం ప్రాజెక్టు నుండి దిగువకు లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి అంటే రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి రైతులను ప్రజలను కాపాడు అని అంటే రేవంత్ రెడ్డి వినలేదు. మాపై కోపాన్ని పక్కకు పెట్టీ నీళ్లు ఎత్తిపోయి అంటే రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు.
'సింగరేణిలో రోజుకో కుంభకోణం.. కరెంట్ కష్టాలు. పొలిమేర వరకు తరిమిన కరువును కాంగ్రెస్ మళ్లీ తెచ్చింది. గోదావరిలో 750 టీఎంసీలు కిందకి వదిలారు. కరువుకు కల్పతరువు కాళేశ్వరం.. కన్నెపల్లి వద్ద కటక నొక్కమంటే వినలే. నేడు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతు బీమాను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ రూ.50 వేల కోట్లు అని.. చివరికి రూ.20 వేల కోట్లు మాత్రమే చేశారు' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఒక్క ఏడాది ధైర్యంగా ఉండండి కేసీఆర్ సర్కారు వస్తుంది మిమ్మల్ని ఆదుకుంటారని తెలిపారు. 'చంద్రబాబు 700 కిలోమీటర్లు నీళ్లు తీసుకుపోయే. ఈ నల్లమల పులి పక్కన ఉన్న మహబూబ్‌నగర్‌కి నీళ్లు ఇవ్వలేదు. బెల్ట్ ట్రీట్‌మెంట్ ఎవరికి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి కాదా? కేసీఆర్ అంటే కే అంటే కాలువలు సీ అంటే చెరువులు.. ఆర్ అంటే రిజర్వాయర్లు. కాంగ్రెస్ అంటే కరువు. రైతులకు కాంగ్రెస్ ఎగొట్టిన 4 రైతు బంధు ఎకరాకు రూ.60 వేలు వెంటనే ఇవ్వాలి' అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
'రైతుబంధు లేదు కానీ రాహుల్ గాంధీ బంధు మాత్రం టకిటకి పడుతున్నాయి. రాహుల్ గాంధీ బందు మాత్రం వారం వారం పడుతుంది. వారం వారం ఢిల్లీకి వెళ్లి మూటల సంచులు ఇచ్చి పదవి రెన్యువల్ చేసుకుంటున్నాడు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిమ్స్ హాస్పిటల్ ప్రమాదానికి ఎలుకలు కారణమట.. నల్లమల్ల పిల్లికి ఎలుకలు పట్టడం రాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
'ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లుచ్చా ప్రభుత్వం. రూ.50 వేల కోట్ల రుణమాఫీని రూ.21 కోట్లకు పరిమితం చేసి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడు. పెన్‌గంగా, ప్రాణహితల నీళ్లు ప్రవహించినా ఆ నీటిని ఉపయోగించుకోలేని అసమర్ద ప్రభుత్వం' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మొగోడు, మొనగాడు అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి అక్రమంగా నీళ్లు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? అని ప్రశ్నించారు. 'రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు కావడంతో పెండింగ్‌లో ఉన్న మూడు పంటల రైతుబంధు పైసలు రైతులకు, కౌలు రైతులకు ఇవ్వాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీజేపీపై తీవ్ర విమర్శలు
'ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా నిలదీశాడా? ఇద్దరు కలసి బిజినెస్ చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ ఎంపీ కదా ఎందుకు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం లేదు. సీసీఐని తుక్కు కింద అమ్ముతున్నారు. బీజేపీ తెలంగాణకు ఏమి ఇచ్చింది. బీజేపీకి ఓటు వేస్తే ఒక్క మేలు జరిగిందా? మోదీ తెలంగాణకి ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇచ్చాడా? మోదీ తెలంగాణ ప్రాజెక్టులను గుజరాత్ తరలిస్తున్నాడు' అని బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ మోసగాళ్ల ను నమ్మి తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.