SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ZPTC And MPTC Elections: గొడవలేం లేవు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రశాంతం: ఎన్నికల సంఘం

SEC Commissioner Inspects ZPTC And MPTC Election Polling: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. ఎన్నికల సంఘం కమిషనర్‌ మాత్రం అంతా ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్‌ సరళిని కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా పరిశీలించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 05, 2026, 03:52 PM IST | Updated: Nov 05, 2026, 03:54 PM IST
Image Credit: Anil Chandra Punetha
Join

ZPTC And MPTC Election Polling Live: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా అన్నీ ఏర్పాట్లు చేశామని.. ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత క్యూలైన్‌లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లు పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరుస్తామని కమిషనర్‌ అనిల్‌ చంద్ర తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ పరిశీలించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించి స్థానిక అధికార యంత్రాంగంతో మాట్లాడారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, విజయవాడ రూరల్ మండలం పాతపాడులోని పోలింగ్ కేంద్రం, గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లపై పోలింగ్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్లతో కూడా మాట్లాడి పోలింగ్ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని.. ఎలాంటి ఇబ్బందులు లేవని ఓటర్లు, పోలింగ్ సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై కమిషనర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. అధికార యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టిందని, అన్ని రాజకీయ పార్టీలు తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నామని, అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామని వెల్లడంచారు. రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తామని తెలిపారు.

తాను సందర్శించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసినట్లు, స్ట్రాంగ్ రూమ్‌లలో కూడా నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరించారు. కృష్ణా జిల్లా ఎన్నికల అబ్జర్వర్ వి. అభిషేక్‌తో కూడా ఎన్నికల సరళి గురించి కమిషనర్‌ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉండడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES