ఏపీలో SIR గడువు మరోసారి పెంపు..
AP SIR Extended: ఆంధ్ర ప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పెంచింది. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన, పరిష్కారణ గడువు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5తో క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార గడువు ముగియనుంది.
SIR Extended in AP: ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో అక్టోబర్ 10 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం ద్వారా అర్హులైన ఓటర్లు తమ పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలను మరింత స్పష్టంగా సరిదిద్దుకోవడానికి తగిన సమయం లభించనుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం, ఓటర్ల జాబితాపై అందిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కార గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించారు. ఈ గడువులోగా వచ్చిన అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఈసీ ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న విచారణలు, నో-మ్యాపింగ్, లాజికల్ డిస్క్రిపెన్సీ కేసులు, ఫారం 6, 7, 8 దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో ఈ పొడిగింపు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది.
అక్టోబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి ఛాన్స్..
సవరించిన షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రక్రియలను పూర్తి చేసి, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 16న అధికారికంగా విడుదల చేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2026 జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈ సవరించిన షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని, ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఈసీ అధికారులను ఆదేశించింది.
అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని వెల్లడి..
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి గత నెలలోనే గడువు పెంచింది. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ఉన్న గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ అనంతరం వాటి పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రక్రియను నవంబర్ 5లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం పూర్తైన తర్వాత నవంబర్ 9న తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.