School Holiday: ముంచుకొస్తున్న మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Sudden School Holiday In These Andhra Pradesh Districts: మరో తుఫాను ముంచుకు వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మురుస తుఫాను నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటివరకు నాలుగు జిల్లాల్లో ప్రకటించగా.. మిగతా జిల్లాల్లో కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.
AP Schools Holiday: మురసు తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లాలో అధికారులు సెలవు ప్రకటించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్వర్వులు జారీ చేశారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్నీ విద్యాలయాలకు సెలవు ఇచ్చారు. మురసు తుపాను కారణంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ లక్ష్మీకళ ప్రకటన చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా విద్యాసంస్థలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాపై కూడా మురసు తుపాను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో మందస్తుగా సూర్యాపేట జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ సెలవు ఇచ్చారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురసు తీవ్ర తుపానుగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తుపాను ప్రభావంతో తిరుపతిలో ఉదయం నుంచి వర్షం పడుతుండగా.. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి. వర్షంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవడంతో అప్పటికప్పుడు సెలవులు ప్రకటించారు.
తుఫాను కదలిక ఇలా
మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలింది.
నెల్లూరుకు 120 కి.మీ., కావలికి 140 కి.మీ., తిరుపతికి 170 కి.మీ. దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది.
ఒంగోలుకు 180 కి.మీ., బాపట్లకు 200 కి.మీ. దూరంలో తుపాను ఉంది.
నేడు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కి.మీ., గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సహాయక చర్యల కోసం 6 ఎన్డీఆర్‌ఎఫ్, 7 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.