Amit Shah Padayatra: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అంతం చేద్దామని.. బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువద్దామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అరాచకత్వాన్ని అంతం చేయాలని కోరారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యేదే కాదని చెప్పారు. కాంగ్రెస్ నిర్వహించింది ఓట్ బచావో ర్యాలీ కాదు.. చొరబాటుదారులను రక్షించే ర్యాలీ అని అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిన సమయం వచ్చింది అని గుర్తుచేశారు. కాంగ్రెస్ 13 కోట్ల ఓట్లు రద్దయ్యాయని అబద్ధాలు ప్రచారం చేస్తోందని.. ఆరున్నర కోట్ల ఓట్లు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారి ఓట్లు తొలగించారని అమిత్‌షా వెల్లడించారు.
'సర్' ప్రక్రియపై కాంగ్రెస్ మిత్రపక్షాలు చేస్తున్న ఉద్యమానికి ప్రతిగా బీజేపీ దేశవ్యాప్తంగా 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం' అనే నినాదంతో పాదయాత్ర చేపడుతోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి మొహంజహి మార్కెట్ వరకు అమిత్ షా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, కేంద్ర మంత్ కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి రాహుల్ గాంధీకీ అమిత్ షా సవాల్ చేశారు. 'ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి మేము సిద్దం. సర్, ఈవీఎం, ఏ అంశంపైనా మేము చర్చకు సిద్దం మీరు సిద్దమా!' అని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చర్చకు రాదని.. వాళ్లకు చర్చకు వస్తే పార్లమెంటులో మోదీ వాళ్లకు చుక్కలు చూపిస్తారని పేర్కొన్నారు. 'ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఈవీఎంలను రాహుల్‌గాంధీ తప్పు పడుతున్నారని.. అదే నిజమైతే తెలంగాణలో మీ సీఎం ఎలా అయ్యారని ప్రశ్నించారు. 'ఈవీఎంలు ఖరాబ్ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలా వచ్చాడు? కేరళలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? తమిళనాడులో మీ ప్రభుత్వం లేదా? హిమాచల్ ప్రదేశ్‌లో మీరు గెలవలేదా?' అని కాంగ్రెస్ పార్టీకి చురకలు అందించారు. కాంగ్రెస్ ఓడిపోతే నెపం ఈవీఎంలపై నెడుతున్నారని చెప్పారు.
'3 కోట్ల మంది చనిపోయినవారి ఓట్లు తొలగించారు. చనిపోయినవారి ఓట్లు తొలగించాలా..? లేదా..? మరో కోటి ఓట్లు డూప్లికేట్ ఓట్లను తొలగించారు. మరి వాటిని తొలగించాలా వద్దా?' అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఇవన్నీ తొలగిస్తుంటే రాహుల్ గాంధీకి కడుపుమంటగా ఉందని చెప్పారు. చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు. ఇండి కూటమి సర్‌ని ఆపాలని చూస్తోందని తెలిపారు.
'ప్రజల ఆదరణతో నరేంద్ర మోదీ గెలిచారు. సర్‌తో కాదు. సర్ చేయకముందే బీజేపీ మూడు సార్లు గెలిచింది. 2014లో మోదీ గెలిచారు. అప్పుడు సర్ జరిగిందా?' అని కాంగ్రెస్ పార్టీని అమిత్ షా ప్రశ్నించారు. భవిష్యత్తులోనూ తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ దేశ ప్రధాని కాలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. గెలిస్తే ప్రజలు గెలిపించినట్టు.. ఓడితే ఈవీఎంలపై నెపం వేస్తున్నారని కాంగ్రెస్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.