Muncipal Corporations Elections Nominations: ఆంధ్ర ప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. అంతేకాదు నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రచ్చ చేస్తున్నారు. పుంగనూరు నామినేషన్ ప్రక్రియతో మొదలైన రగడ రాష్ట్రంలో అన్ని చోట్లా రగులుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమలో హై టెన్షన్ నెలకొంది.
పులివెందులలో కాల్పుల ఘటన జరుగడంతో ఇక ఆఖరి రోజు ఎన్నికల కమిషన్ ప్రక్రియపై పోలీసులు దృష్టి పెట్టారు. పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాయలసీమలో అధఙకారులు హై అలర్ట్ ప్రకటించారు. తొలి రెండు రోజులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆఖరి రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ భద్రతను కట్టుదిట్టం చేసింది. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించనుంది.
కనీసం మీడియాను కూడా నామినేషన్ కేంద్రం లోపలికి అనుమతించకుండా గట్టి చర్యలు తీసుకుంది. నామినేషన్ ప్రక్రియకే ఈవిధమైన దాడులు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే ఎన్నికల సమయం, కౌంటింగ్ వేళ ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.