ఉప్పాడ కన్నీటి గాథ.. సముద్రంలో కనుమరుగవుతున్న పల్లె..!
Uppada Beach: ఒకప్పుడు మల్లెతీగ లాంటి ఇళ్లతో... కళకళలాడిన పల్లె అది. కానీ ఇప్పుడక్కడ ఇళ్లు లేవు... మనుషులు లేరు... కేవలం రాకాసి అలల ఘోష మాత్రమే వినిపిస్తోంది! కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం నిశ్శబ్దంగా సముద్రంలో కలిసిపోతోంది. తరతరాలుగా బతుకులను ఇచ్చిన ఊరు... కళ్లముందే నీట మునుగుతుంటే ఆ ప్రజల ఆవేదన వర్ణనాతీతం. అసలు ఉప్పాడను ఈ దుస్థితికి నెట్టింది ఎవరు? ప్రకృతి కోపమా? లేక మానవ తప్పిదాల శాపమా? ఈ ఉగ్రరూపం వెనుక ఉన్న లోతైన శాస్త్రీయ కారణాలు ఏంటి?
Uppada Tragic Story: ఉప్పాడ అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది అందమైన సముద్ర తీరం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఉప్పాడ పట్టుచీరలు. కానీ ఇప్పుడు ఆ పేరు వింటేనే స్థానికులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాకినాడ నుంచి ఋషికొండ వైపు వెళ్లే తీరప్రాంతంలో సముద్రం రోజురోజుకూ ముందుకు చొచ్చుకొస్తోంది. నిన్నటివరకు నడిచి వెళ్లిన రోడ్లు, ఆడుకున్న ఆటస్థలాలు అన్నీ ఇప్పుడు నీటి అడుగున సమాధి అయ్యాయి. ఊరికి ఊరే సముద్ర గర్భంలో కలిసిపోతున్నా...అడ్డుకట్ట వేయలేక ప్రజలు నిస్సహాయంగా రోదిస్తున్నారు.
ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. దశాబ్దాలుగా జరుగుతున్న నిశ్శబ్ద విధ్వంసం. గత యాభై ఏళ్లలో ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 1500 ఎకరాలకు పైగా భూమి సముద్రంలో కలిసిపోయింది. ఒకప్పుడు సముద్రానికి, ఊరికి మధ్య భారీగా ఇసుక తిప్పలు, ఖాళీ స్థలాలు ఉండేవి. కాలక్రమేణా అలల తీవ్రత పెరిగి ఆ దూరం కాస్తా కరిగిపోయింది. పాత ఉప్పాడ గ్రామం, చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు నేడు సముద్రం పాలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
హోప్ ఐలాండ్‌తో దారిమళ్లిన సహజ ఇసుక మేటలు..
అసలు సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది? దీని వెనుక ఉన్న ప్రధాన శాస్త్రీయ కారణం 'లిటోరల్ డ్రిఫ్ట్' అనబడే సముద్రపు ఇసుక ప్రవాహ మార్పు. సహజంగా బంగాళాఖాతంలో సముద్రపు అలలు దక్షిణ నుంచి ఉత్తర దిశకు ఇసుకను మోసుకొస్తుంటాయి. అయితే, కాకినాడలో నిర్మించిన డీప్ వాటర్ పోర్టు, సహజ సిద్ధంగా ఉన్న 'హోప్ ఐలాండ్' నిర్మాణం వల్ల ఈ ఇసుక ప్రవాహ దిశ మారింది. ఉప్పాడ తీరానికి రావాల్సిన ఇసుక మేటలు ఆగిపోయాయి. ఫలితంగా, అలలు కొట్టే దెబ్బకు తీరం కోతకు గురవుతోంది తప్ప, దాన్ని భర్తీ చేయడానికి కొత్త ఇసుక చేరడం లేదు.
అలల ధాటికి కరిగిపోతున్న తీరప్రాంతం..
సహజ మార్పులతో పాటు మనుషులు చేసిన తప్పులు కూడా ఈ ముంపును మరింత వేగవంతం చేశాయి. ఒకప్పుడు తీరంలో దట్టంగా ఉండే మడ అడవులు సముద్రపు అలల ఉధృతిని అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా ఉండేవి. కానీ, వాటన్నింటినీ నాశనం చేసి ఆక్వా చెరువులు తవ్వడం, అక్రమంగా ఇసుకను తోడేయడం వల్ల తీరం బలహీనపడింది. దీనికితోడు ఉప్పాడ వద్ద సముద్రం లోతు ఎక్కువగా ఉండటంతో, అలలు నేరుగా ఒడ్డును బలంగా ఢీకొట్టి భూమిని కుంగదీస్తున్నాయి.
బంగాళాఖాతంలో పెరుగుతున్న సముద్ర మట్టాలు..
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగా సముద్ర మట్టాలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బంగాళాఖాతంలో తరచూ ఏర్పడుతున్న తీవ్ర తుపాన్లు, అల్పపీడనాల వల్ల అలల ఎత్తు సాధారణం కంటే ఎన్నో రెట్లు పెరుగుతోంది. ప్రతి తుపాను వచ్చినప్పుడూ ఉప్పాడ తీరం కోతకు గురై కిలోమీటర్ల మేర భూమి నీట మునుగుతోంది. పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నట్లుగా ఇదే పరిస్థితి కొనసాగితే, రాబోయే కొన్ని సంవత్సరాలలో ఉప్పాడ మ్యాప్ నుంచే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది!
ఉప్పాడను కాపాడుకోవడానికి ప్రభుత్వం గతంలో జియో ట్యూబ్స్, రాతి గోడల వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసినా... సముద్రుడి ఉగ్రరూపం ముందు అవి తేలిపోయాయి. కాబట్టి, కేవలం ప్రయోగాత్మక చర్యలు కాకుండా...శాశ్వత రక్షణ గోడలు, ఆఫ్‌షోర్ బ్రేక్‌వాటర్స్ వంటి పటిష్టమైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించాలి. అప్పుడే ఉప్పాడ తీరం నిలబడుతుంది.