YS Jagan Mohan Reddy: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని అధికారులు కూల్చివేశారంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! ఆంజనేయపురంలోని శతాబ్దాల నాటి అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం, కోట్లాది భక్తుల విశ్వాసంపై దాడి చేయడం నిజంగా కలవరపెడుతోంది. తిరుమల చారిత్రాత్మక వెయ్యి స్తంభాల మండపాన్ని ధ్వంసం చేయడం నుండి, కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలోని 40 దేవాలయాలను కూల్చివేయడం, బద్వేల్‌లోని కాశీనాయన జ్యోతి క్షేత్రాన్ని కూల్చివేయడం వరకు, ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని అన్వేషించకుండా పవిత్ర కట్టడాలు ధ్వంసం చేయబడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, చంద్రబాబు గారి ప్రభుత్వం వారసత్వ ప్రదేశాలను బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే మీ ప్రభుత్వం ఇలాగేనా నిర్వచించేది?
తమ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం.. పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్ట్ ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వం చారిత్రక వారసత్వ సంపదను బుల్‌డోజర్లతో నేలమట్టం చేస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని రక్షించడమంటే ఇదేనా అంటూ ఆయన ప్రభుత్వ ప్రశ్నించారు.
అటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించారు. జాతీయ రహదారి 716 విస్తరణ కోసం రోడ్డు మార్గాన్ని మార్చే ఛాన్స్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పురాతన ఆలయాన్ని కూల్చివేసిందని ఒక వీడియో ప్రకటనలో ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హిందూ ధర్మాన్ని కాపాడే విధానం ఇదేనా అంటూ నిలదీశారు.
ధనవంతుల భూములు, ఆస్తులను కాపాడేందుకు కారకంబడి సమీపంలో జాతీయ రహదారి మార్గాన్ని మార్చడం వల్ల చారిత్రాత్మక అభయాంజనేయ స్వామి ఆలయానికి నష్టం వాటిల్లిందని భూమన ఆరోపించారు. ఆలయ ప్రత్యేకతను వివరిస్తూ.. ఇక్కడి దైవం స్వయంభువని, ఈ ప్రదేశం అగస్త్య మహర్షి భార్య లోపముద్రతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. సుమారు 1,400 సంవత్సరాల క్రితం పల్లవ రాజులు ఆలయ గోపురాన్ని, కోనేరును నిర్మించారని, తాళపాక అన్నమాచార్యులు కూడా దైవ స్తుతిలో సంకీర్తనలు రచించారని ఆయన గుర్తుచేసుకున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆయన చెప్పారు. గతంలో బ్రిటిష్ పాలకులు ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి, మామండూరు సమీపంలో ఆంజనేయపురం రైల్వే స్టేషన్‌ను కూడా నిర్మించారని ఆయన తెలిపారు.
వేద పండితుల పర్యవేక్షణ లేకుండా, పవిత్రమైన కార్తీక సోమవారం నాడు జేసీబీతో ఆలయాన్ని కూల్చివేయడం ఘోరమైన అన్యాయమని భూమన విచారం వ్యక్తం చేశారు. ఒకవైపు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నామని చెబుతూ, మరోవైపు పాత ఆలయాన్ని కూల్చివేసి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు.