SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

YSRCP: ఓట్లు అడిగే ధైర్యం లేక పోలీసులతో ఎన్నికల నిర్వహణ బాధ్యత: సజ్జల

Sajjala Ramakrishna Reddy Hot Comments On Chandrababu About Elections: చంద్రబాబుకు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేక పోలీసులకు ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 16, 2026, 14:56 IST | Updated: Nov 16, 2026, 15:02 IST
Image Credit: Sajjala Ramakrishna Reddy Press Meet
Join

AP Elections: ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేక పోలీసులకు పీపీసీ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు తెచ్చుకోవాలని.. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతోనే ప్రజల దగ్గరకు వెళ్లలేక పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరుపుతున్నారని టీడీపీపై విమర్శలు చేశారు. 'ఎస్సై రాత్రి 11 గంటలకు హత్యాయత్నం, దాడులంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. అర్థరాత్రి 12.30 గంటలకు ఎస్పీ, కలెక్టర్ మాత్రం అంతా ప్రశాంతంగా జరిగిందని చెబుతారు. ఒకే ఘటనపై పోలీసు అధికారుల మధ్య ఇంత వైరుధ్యం ఎందుకు? ఎవరి ఆదేశాలతో ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు?' అని ప్రశ్నించారు.

గుంటూరు జిల్లా జైలులోని లేళ్ల అప్పిరెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్‌ను తరలిస్తున్న వారిని అడ్డుకున్నందుకు అభ్యర్థులను అభినందించాల్సింది పోయి.. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని 10 రోజులుగా జైలులో పెట్టడం దుర్మార్గం. ఇది మామూలు తప్పుడు కేసు కాదు.. ఇంత అన్యాయమైన కేసు ఎప్పుడూ చూడలేదు' అని సజ్జల రామకృష్ణారెడ్డి తలెఇపారు. బ్యాలెట్ బాక్స్‌ను ఎక్కడికో తీసుకెళ్తుంటే అడ్డుకుని మళ్లీ అధికారులకు అప్పగించే ప్రయత్నం మాత్రమే చేసినట్లు వివరించారు. ఎక్కడ వీడియోలు చూసినా ఇదే కనిపిస్తోందని.. దీనిలో హత్యాయత్నం ఎక్కడుంది? అని ప్రశ్నించారు. దోషులను వదిలేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారిపై కేసులు పెడతారా? అని మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు.

'వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులను ఒకరి తర్వాత ఒకరిని జైలుకు పంపాలనే లక్ష్యంతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు తమ బాధ్యతలు మర్చిపోయి ఒక కిరాయి సైన్యంలా పనిచేస్తున్నారు. యూనిఫామ్‌లో వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు' అని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 'చంద్రబాబు, లోకేశ్‌ ఎన్నికల నిర్వహణ బాధ్యతను పోలీసులకు కాంట్రాక్టు ఇచ్చినట్టున్నారు. ఎన్నికలు జరిగినట్టు ఉండాలి, మా వాళ్లకు ఫ్రీగా వదిలేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నట్టుగా పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు' అని ఆరోపించారు.

'వీడియోల్లో ఎక్కడా అప్పిరెడ్డి లేరు, ఎస్సై లేరు, బస్సు లేదు, దాడి చేసినట్లు చెప్పే జనాలు లేరు. బ్యాలెట్ బాక్స్‌ను తీసుకెళ్తున్న అధికారిని ఒక మహిళా అభ్యర్థి ప్రశ్నించి.. ఆపి మళ్లీ అధికారులకు అప్పగించే ప్రయత్నం చేసిన దృశ్యాలే ఉన్నాయి. ఇంకెంత సాక్ష్యం కావాలి?' అని మాజీ సలహాదారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. బ్యాలెట్ బాక్స్‌ను తరలించిన ఘటనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. దాన్ని అడ్డుకున్న వారిపైనే డెకాయిటీ, హ‌త్యాయ‌త్నం వంటి తీవ్రమైన సెక్షన్లు పెడుతున్నారని పోలీసుల తీరుపై మండిపడ్డారు. కేసు పెట్టడం, బెయిల్ రాకుండా చేయడం, జైలులో పెట్టడం.. ఇదేనా పోలీసుల బాధ్యత? ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు.

'ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయం రేపు మరొకరికి జరగదని అనుకోవద్దు. రెండు పార్టీలు కొట్టుకుంటుంటే మాకేం సంబంధం లేదని చూసేవాళ్లు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ అరాచక సంస్కృతి ఎవరినీ వదిలిపెట్టదు' అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్ నాయకత్వంలో ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం నిలబడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాటిన ఈ అరాచక విత్తనం రేపు వ్యవస్థలనే కూల్చేస్తుందని.. ఈ సంస్కృతి ఎక్కడికి దారితీస్తుందో అందరూ ఆలోచించాలని ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES