Cars Price Hike: ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పండుగ సీజన్‌కు ముందు భారీగా ధరలు పెంచి వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చిన దిగ్గజ కంపెనీలు.. ఇప్పుడు మరోసారి ధరలు పెంచేశాయి. మూడు ఆటోమొబైల్ ప్రముఖ కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా తమ ధరలను సవరించాయి. ధరలు పెంచిన కంపెనీల్లో టాటా మోటర్స్, హ్యుండయ్ మోటర్, ఆడి సంస్థలు ఉన్నాయి.
ఇప్పటికే దేశీయ సుజుకీ మారుతీ సంస్థ కార్ల ధరలను వరుసగా పెంచేస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు మారుతీ తన కార్లను ధరలను పెంచుతూ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. మారుతీ సుజుకీ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. అదే బాటలో టాటా మోటార్స్, హ్యుందాయ్, ఆడీ నడిచాయి. తమ కార్ల ధరలను సవరిస్తూ మంగళవారం ఆయా కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపునకు కారణం ముడి పదార్థాల వస్తువుల ధరల పెరుగుదలనే కారణంగా చెబుతున్నాయి. ఆ భారాన్ని కూడా వినియోగదారులపై కార్ల ఉత్పత్తి సంస్థలు వేశాయి. ఈ కంపెనీలు ధరలు పెంచడంతో మిగిలిన సంస్థలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మిగతా ఆటో మొబైల్ కంపెనీలు కూడా తమ మోడళ్ల ధరలు పెంచే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
టాటా మోటార్స్: తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని ఎస్‌యూవీలు, కార్ల ధరలను 0.5 శాతం మేర పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్రకటించారు. పెంచిన కొత్త ధరలు డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అన్నీ కార్ల ధరలు కాకుండా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని టాటా మోటర్స్ వెల్లడించింది.
హ్యుందాయ్ మోటార్స్: ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.8 వేల వరకు పెంచుతూ హ్యుందాయ్ మోటార్స్ సంస్థ నిర్ణయం తీసుకుంది. హ్యుండయ్ కూడా కొత్త ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.
ఆడీ కార్లు: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడీ కూడా తన కార్ల ధరలను పెంచేసింది. భారత్ మోడళ్లలోని ఎక్స్‌షోరూం ధరలను రెండు శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కొత్త ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
వరుసగా బాదుడు
మారుతీ, టాటా, హ్యుండయ్, ఆడీ సంస్థలు కార్ల ధరలను అమాంతం పెంచేయడంతో వినియోగదారులపై భారీ ప్రభావం చూపనుంది. పెంచిన ధరల ప్రభావం పండుగ సీజన్‌పై తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. వాస్తవంగా దసరా, దీపావళి సమయంలో పెద్ద ఎత్తున వినియోగదారులు కార్లు కొనుగోలు చేసే వారు. కానీ ఈ పండుగ సీజన్‌లో కార్లు విక్రయాలు అమాంతం తగ్గిపోయాయి. దీనికి కారణం ధరల పెంపు అని స్పష్టంగా తెలుస్తోంది.
ధరల పెంపునకు కారణాలు ఇవే?
ముడి సరకుల ఖర్చులు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణంగా కంపెనీలు పేర్కొన్నాయి. పెరుగుతున్న వ్యయ భారాన్ని కంపెనీలు భరించడం లేదు. ముడి సరుకుల వ్యయం భారమైనా భరించేందుకు భరిస్తున్నా.. ధరల ఒత్తిళ్ల నేపథ్యంలో ఇక వినియోగదారులపై భారం వేయక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. తమ వ్యయ భారాన్ని కొంత తగ్గించుకోవడంలో భాగంగా వినియోగదారులపై మోపుతున్నారని ఆటోమొబైల్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.