Madanapalle Tomato Market: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డ్ అంటేనే వ్యాపారానికి పెట్టింది పేరు. ఇక్కడికి స్థానిక రైతులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది రైతులు టమోటాలను తీసుకొస్తుంటారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోళ్లు జరుపుతుంటారు. మార్కెట్‌కు వచ్చే టమోటాల పరిమాణం, నాణ్యత, ప్రస్తుత డిమాండ్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తారు. ప్రతిరోజూ కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే ఈ మార్కెట్‌లో పంటను నమ్ముకున్న రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం ఒక పెద్ద సవాలుగా మారింది.
రైతులకు సౌలభ్యం కల్పించే దిశగా మదనపల్లె టమోటా మార్కెట్‌లో ఇటీవల 'చిన్న క్రేట్ల గ్రేడింగ్ విధానాన్ని' ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు పెద్ద క్రేట్లలో టమోటాలను గ్రేడింగ్ చేసే విధానం కొనసాగగా, ఈ కొత్త చిన్న క్రేట్ల పద్ధతి వల్ల టమోటాలను వేరు చేయడం, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయడం మరింత సులభతరం అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ మార్పు నిజంగా రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? వారి శ్రమను, అదనపు ఖర్చులను తగ్గిస్తుందా? లేదా అనేది ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తేనే స్పష్టమవుతుంది.
మదనపల్లె మార్కెట్‌లో రైతులను తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య.. ధరల్లోని తీవ్ర హెచ్చుతగ్గులు! ఒకరోజు మార్కెట్‌లో టమోటాకు మంచి ధర లభిస్తే రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కానీ, అదే ఆశతో మరుసటి రోజు మార్కెట్‌కు సరుకు ఎక్కువగా తీసుకొస్తే, ఒక్కసారిగా ధరలు పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మంచి ధర వస్తుందనే నమ్మకంతో పంటను మార్కెట్‌కు తరలించే సమయానికి ధరలు తగ్గడంతో ఆశించిన ఆదాయం రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ ట్రెండ్‌ను ముందుగానే అంచనా వేయలేక దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
టమోటా సాగు చేయడం అంటే మాటలు కాదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నీటి యాజమాన్యంతో పాటు పంట కోత, మార్కెట్‌కు రవాణా కోసం రైతులు ఎకరానికి వేల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. నెలల తరబడి కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొచ్చినప్పుడు తగిన ధర లభించకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో మార్కెట్‌కు తీసుకురావడానికి అయిన రవాణా ఛార్జీలు, కూలీల ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడానికి ఎంత కష్టపడినా...చివరకు మార్కెట్ లక్ పైనే తమ భవిష్యత్తు ఆధారపడుతోందని వాపోతున్నారు.
దేశంలోనే పేరుగాంచిన మదనపల్లె టమోటా మార్కెట్‌పై ఆధారపడిన రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజువారీ మార్కెట్ ధరలపై ముందుగానే రైతులకు సమాచారం అందించడం, కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత పెంచడం, గ్రేడింగ్ విధానాలను మెరుగుపరచడం అత్యవసరం. అంతేకాకుండా, ధరలు ఉన్నపళంగా పడిపోయినప్పుడు రైతులకు ఎదురయ్యే నష్టాలను తగ్గించేలా మార్కెట్ అధికారులు, ఉద్యానవన శాఖ తగిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఒకవైపు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మదనపల్లె మార్కెట్..మరోవైపు రక్తం కూడు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్న రైతులు! కొత్తగా తీసుకొచ్చిన చిన్న క్రేట్ల గ్రేడింగ్ విధానం రైతులకు ఏమాత్రం ఊరటనిస్తుందో వేచి చూడాలి. కేవలం గ్రేడింగ్ విధాన మార్పులే కాకుండా, ధరల హెచ్చుతగ్గుల వల్ల రైతులు నిలువునా మునిగిపోకుండా ప్రభుత్వాలు, అధికారులు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. అన్నదాత శ్రమకు తగిన ప్రతిఫలం దక్కినప్పుడే వ్యవసాయం నిలదొక్కుకుంటుంది, రైతు నిలబడతాడు. మరి ఎంతో చరిత్ర కలిగిన మదనపల్లె టమోటా రైతుల కష్టాలకు, ధరల అనిశ్చితికి ఎప్పుడు ముగింపు లభిస్తుంది? అధికారుల చర్యలు రైతుల్లో మళ్లీ నమ్మకాన్ని నింపుతాయా? అనేది వేచి చూడాల్సిందే..!