TTD News: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన చక్రస్నాన ఘట్టం వైభవంగా పూర్తయింది. వరాహాస్వామి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. పుష్కరిణి వద్ద వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య చక్రస్నాన కార్యక్రమం జరిగింది. చక్రత్తాళ్వార్‌కు పవిత్ర స్నానం నిర్వహించిన అనంతరం భక్తులు కూడా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
చక్రస్నాన కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో చి. వెంకయ్య చౌదరి సహా టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చక్రస్నానం పూర్తవడంతో తొమ్మిది రోజులుగా వైభవంగా సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
ధ్వజావరోహణంతో ముగయనున్న బ్రహ్మోత్సవాలు..
రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగుస్తాయి. చక్రస్నానాన్ని దర్శించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తుల భద్రత, క్యూలైన్లు, రద్దీ నియంత్రణ కోసం టీటీడీ, పోలీసు, విజిలెన్స్ తదితర విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేశాయి.
చక్రస్నానం ..
చక్రస్నానం సందర్భంగా.. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామిని పుష్కరిణి తీర్థానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అత్యంత పవిత్రమైన చక్రస్నానం వేడుకను శ్రీవారి పుష్కరిణిలో చేపట్టారు. శ్రీవారి సుదర్శన చక్రంతో అర్చకులు, వేద పండితులు పవిత్ర స్నానం చేశారు. ఇక గ్యాలరీలోని భక్తులను దశలవారీగా పుష్కరిణిలోకి అనుమతించారు. ఈ మేరకు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఇవాళ రాత్రి నిర్ణీత ముహూర్తంలో ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించడంతో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవం..
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు అశ్వ వాహన సేవ వైభవంగా జరిగింది. కల్కి అవతారంలో శ్రీ మలయప్ప స్వామి అశ్వ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణ, మంగళ వాయిద్యాలు, భజనల నడుమ అశ్వ వాహన సేవ కన్నుల పండువగా కొనసాగింది. స్వామివారి దర్శనం కోసం మాడ వీధుల్లోకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్కి అలంకారంలోని శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహన సేవలో కళాబృందాల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.