SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విజయవాడ మేయర్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన మాజీ ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు..

AB Venkateshwara Rao filed has Nomination Vijayawada Mayor: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నేడు ఆయన అధికారికంగా రిటర్నింగ్ అధికారుల ఎదుట నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి నేరుగా నగర మేయర్ స్థానానికి పోటీ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 18, 2026, 01:40 PM IST | Updated: Oct 18, 2026, 01:43 PM IST
Image Credit: AB Venkateshwara Rao nomination (ZEE News Telugu/Source)
Join

AP Local Body Elections: విజయవాడ మేయర్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఏబీ వెంకటేశ్వరరావు ముందుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తనకు నైతిక, రాజకీయ మద్దతు ప్రకటించాలని కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అధికారికంగా లేఖ రాశారు. రాజధాని ప్రాంతంలో ప్రజల గళాన్ని వినిపించేందుకు, నిబద్ధతతో కూడిన పరిపాలన అందించేందుకు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల అత్యంత సానుకూలంగా స్పందించి, కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ మద్ధతు. 
ఏబీ వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వానికి మద్దతు తెలపడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ విజయవాడ మేయర్ పీఠానికి తమ అభ్యర్థిని పోటీలో నిలపకుండా ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిని బరి నుంచి తప్పించి, ఏబీవీకి పూర్తి మద్దతు పలకడం ద్వారా నగరంలో కూటమి, వైసీపీలకు బలమైన ప్రత్యామ్నాయంగా ఆయనను నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. షర్మిల తీసుకున్న ఈ నిర్ణయంతో బెజవాడ కార్పొరేషన్ పోరులో ఓట్ల చీలిక సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల విభాగంలో, ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన తీవ్ర ఆరోపణలు, సస్పెన్షన్లు ఎదుర్కొన్నప్పటికీ న్యాయ పోరాటం చేసి పదవీ విరమణ పొందారు. విజయవాడ నగరంతో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉండటం, పోలీసు అధికారిగా సమర్థుడైన వ్యక్తిగా పేరుండటంతో ఆయన రాక సాధారణ పౌరుల్లో సరికొత్త చర్చకు దారితీసింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తాజా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని బరిలోకి దించగా, అటు అధికార కూటమి అభ్యర్థులూ ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగడంతో విజయవాడ మేయర్ ఎన్నిక ఏక పక్షంగా కాకుండా బహుముఖ పోరుగా మారింది. నగరంలోని తటస్థ ఓటర్లు, ఉద్యోగ, వ్యాపార వర్గాల మద్దతును కూడగట్టేందుకు ఏబీవీ రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనున్న వేళ ఏబీవీ ఎంట్రీ ఇవ్వడం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహకర్తలకు సరికొత్త సవాలుగా మారింది. ఆయన దాఖలు చేసే నామినేషన్‌కు ఏయే వర్గాలు మద్దతు తెలుపుతాయి? ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రధానంగా ఏ అంశాలను లేవనెత్తుతారు? అన్నది ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్‌గా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES