Mangalagiri Lodge Incident: ప్రమోషన్ వీడియో అని పిలిచి మంగళగిరిలో యువతిపై అత్యాచారం..రూ.14,000 దోపిడి!
Mangalagiri Lodge Incident Case: ఆన్‌లైన్, సోషల్ మీడియా పరిచయాలు పెను ప్రమాదాలకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతిని పెట్ షాప్ ప్రమోషన్ రీల్స్ చేయాలంటూ మంగళగిరి రప్పించి, మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కడప పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును మంగళగిరికి బదిలీ చేయగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Mangalagiri Lodge Incident Case: కడప జిల్లాకు చెందిన ఓ యువతి సింగర్, యాంకర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమెకు మంగళగిరికి చెందిన జిలానీ అలియాస్ సిద్దిక్‌తో పరిచయం ఏర్పడింది. విజయవాడలో తనకు ఓ పెట్ షాప్ ఉందంటూ నమ్మబలికిన జిలానీ, పరిచయం జరిగిన మూడు నెలల తర్వాత ఆ షాప్‌నకు సంబంధించి ప్రమోషనల్ రీల్స్ చేయాల్సిందిగా ఆమెను కోరాడు. ఈ రీల్స్ చేసినందుకు గాను రూ. 30,000 పారితోషికం చెల్లిస్తానని ఆశచూపాడు. అతని మాటలను నిజమని నమ్మిన బాధితురాలు గత నెల 20వ తేదీన మంగళగిరికి చేరుకుంది.
లాడ్జి గదిలో మత్తుమందు ఇవ్వడం..
మంగళగిరి చేరుకున్న అనంతరం, స్థానిక లాడ్జిలోని రూమ్ నంబర్ 303లో ఉండాలని జిలానీ ఆమెకు సూచించాడు. బాధితురాలు ఆ గదిలో వేచి చూస్తుండగా, అక్కడికి వచ్చిన నిందితుడు తాగడానికి మంచినీరు అందించాడు. నీరు తాగిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో నిందితుడు జిలానీ ఆమెను వివస్త్రను చేసి నగ్నంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించాడు.
అత్యాచారం, ఆర్థిక దోపిడీ..
సుమారు మూడు గంటల తర్వాత బాధితురాలు స్పృహలోకి రాగా, ఆ న్యూడ్ ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె మొబైల్ ఫోన్ ఉపయోగించి రూ. 16,000 ఫోన్‌పే ద్వారా బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని తీవ్రంగా బెదిరించి, లాడ్జి గదికి బయట నుంచి గడియపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
మరుసటి రోజు అతికష్టం మీద గది నుంచి బయటపడిన బాధితురాలు స్వగ్రామమైన కడపకు చేరుకుంది. అయితే కడపకు వెళ్లిన తర్వాత కూడా నిందితుడి నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ రావడంతో, తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె గత నెల 24న కడప పోలీసులను ఆశ్రయించింది.
ఘటన మంగళగిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరగడంతో కడప పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం కేసును మంగళగిరి పట్టణ పోలీసులకు బదిలీ చేశారు. కేసు స్వీకరించిన మంగళగిరి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు జిలానీని అదుపులోకి తీసుకున్నారు. లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారాలను సేకరిస్తూ, త్వరలోనే నిందితుడి అధికారిక అరెస్టును చూపిస్తామని వెల్లడించారు.