Vijay AP Tour: రేపు ఏపీ టూర్‌కు తమిళ సీఎం విజయ్.. ఐదారు గంటలు బిజీబిజీ
Full Schedule Of TN CM Vijay AP Tour For Tomorrow And Agenda: తమిళనాడులో సంచలన విజయం సాధించిన టీవీకే విజయ్ తొలిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. విజయవాడ దసరా ఉత్సవాలతోపాటు ఏపీ, తమిళ రాష్ట్రాల మధ్యనున్న సత్సంబంధాల బలోపేతంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం ఈ పర్యటన దోహదం చేయనుంది. విజయ్ ఏపీ టూర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow Vijay AP Tour: సరిహద్దులు పంచుకునే రాష్ట్రాలు.. నదీ జలాలు పంచుకున్నట్టే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న విజయ్ తొలిసారిగా ఏపీ రాష్ట్రానికి రాబోతున్నారు. విజయవాడ దసరా ఉత్సవాలతోపాటు ఏపీ, తమిళ రాష్ట్రాల మధ్య సత్సంబంధాల బలోపేతంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం ఈ పర్యటన దోహదం చేయనుంది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకోవడంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబుతో విజయ్ సమావేశం కానున్నారు. ఏపీ పర్యటన చేపడుతున్న విజయ్ రేపు దాదాపు నాలుగు ఐదు గంటలు పూర్తి బిజీబిజీగా ఉండనున్నారు. విజయ్‌కు సంబంధించిన ఏపీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
రేపు అక్టోబర్ 13వ తేదీన సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత విజయ్ రానున్నారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు. అనంతరం విజయవాడలో నిర్వహించే ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అంతకుముందు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో విజయ్ భేటీ కానున్నారు.
తమిళ సీఎం విజయ్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తమయ్యాయి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు, ఆలయ ప్రాంగణంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. బాంబ్ స్క్వాడ్, యాంటీ సబాటేజ్ బృందాలతో అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇంద్రకీలాద్రి ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, విశ్రాంతి గదుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. దసరా భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తమిళనాడు సీఎం పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అధికారుల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
విజయ్ పర్యటన షెడ్యూల్ ఇదే!
అక్టోబర్ 13వ తేదీన మధ్యాహ్నం 3.00 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి పయనం
సాయంత్రం 4.00 గంటలకు గన్నవరం (విజయవాడ) విమానాశ్రయానికి చేరిక
4- 4.10 గంటల మధ్య విమానాశ్రయంలో ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధుల స్వాగతం
సాయంత్రం 4.10 గంటలకు విమానాశ్రయం నుంచి ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయానికి రోడ్డు మార్గంలో పయనం
సాయంత్రం 4.55 గంటలకు కనకదుర్గ ఆలయానికి చేరుకుని 5.45 గంటల వరకు అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు
5.45 గంటలకు కనకదుర్గ ఆలయం నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరడం
సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య సీఎం చంద్రబాబుతో భేటీ. ఈ సమావేశంలో నదుల అనుసంధానంపై, గోదావరి - కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్ట్, కృష్ణా జలాల విడుదలపై చర్చించే అవకాశం
సాయంత్రం 7.00 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి పున్నమి ఘాట్‌కు బయల్దేరి 7.10 గంటలకు దసరా ఉత్సవ్ కార్యక్రమాలకు హాజరు
సాయంత్రం 7.10 నుంచి 8.00 గంటల వరకు దసరా ఉత్సవ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి తమిళ సీఎం విజయ్ వీక్షణ
రాత్రి 8 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి బయలుదేరి 9 గంటలకు చెన్నైకి తిరుగు ప్రయాణం