India vs West Indies 4th T20I: సుదీర్ఘకాలం తర్వాత భారత జట్టు హైదరాబాద్ గడ్డకు వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లు మినహా కొన్నేళ్లుగా హైదరాబాద్‌కు దూరమైన టీమిండియా ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చింది. వెస్టిండీస్‌తో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది. రేపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న కీలక మ్యాచ్‌లో విండీస్‌తో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కీలకమైన ఈ మ్యాచ్‌పై భారత్ భారీ ఆశలు పెట్టుకోగా.. అదే స్థాయిలో ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉండడంతో మ్యాచ్‌కు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కీలక సూచనలు చేశారు.
ఉప్పల్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి కీలక విషయాలు వెల్లడించారు. భారత్–వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ఈనెల 14న ఉప్పల్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సుమారు 40 వేల మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండటంతో 2,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
'ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో 408 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిఘా ఉంచనున్నాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రేక్షకుల వాహనాల కోసం 4,600 కార్లు, 3,400 ద్విచక్ర వాహనాలు నిలిపేలా పార్కింగ్ సదుపాయం కల్పించాం' అని పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. పార్కింగ్‌కు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని అధికారులు చెప్పారు. మహిళల భద్రత కోసం ఎనిమిది షీ టీమ్స్ విధులు నిర్వహించనుండడంతో ఆకతాయిల భరతం పట్టనున్నారు. మద్యం సేవించి వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించబోమని కమిషనర్ స్పష్టం చేశారు.
మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుండటంతో ప్రేక్షకులు రెండు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలని సీపీ సుమిత సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యమివ్వాలని, ఆన్‌లైన్ టికెట్ల కొనుగోలులో నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.