Social Media Influencers: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గం ఇటీవల ఒక విచిత్ర విధానానికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిని వాడుకోవడం కోసం కొత్త పాలసీకి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్లకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ లో ఉన్న ఫాలోవర్లకు తమతమ రీచ్ అంశాల ఆధారంగా పారితోషికం చెల్లిస్తారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉంటే ఎ-కేటగిరీ కింద 50 వేల నుంచి లక్ష మధ్య నగదు చెల్లిస్తారు. ఇక బీ-కేటగిరీలో 25 వేల నుంచి 50 వేల మధ్య సి-కేటగిరీ 10 వేల నుంచి 25 వేల మధ్య ఫాలోవర్లు ఉంటే డి-కేటగిరీగా నిర్ణయించారు. దీని ప్రకారం ఇన్ ప్లూయెన్సర్లకు 15 వేల రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకూ చెల్లిస్తారు. అయితే ఈ విధానం టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టుల కోసమే అన్న విమర్శలు మొదలయ్యాయి.
మరోవైపు డబ్బులు చెల్లించి ఇన్ ప్లూయెన్సర్ల ద్వారా ప్రభుత్వం ప్రచారం చేయించుకుంటే వాస్తవాలు మరుగున పడే పరిస్థితి కనిపిస్తోంది. రీల్స్‌కు ప్రాధాన్యమిస్తే రియాల్టీ బయటకు రాదనే వాదన వినిపిస్తోంది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ఇదే జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో రాజమండ్రిలో గ్రాండ్ గా టూరిజం డే వేడుకలు నిర్వహించారు.
రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా చెప్పినా ఈవెంట్ కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ కోసమే అన్నట్లుగా మారింది. విశాఖ నుంచి రెండు ప్రత్యేక డబుల్ డెక్కర్ బస్సులను తీసుకువచ్చి రాజమండ్రి నగరంలో తిరుగుతూ రీల్స్ చేయించారు. సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్లే ఏపీ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్లు అంటూ మంత్రి దుర్గేష్ ప్రకటించారు. అరిటాకుల్లో ఆంధ్ర భోజనం వారికి స్వయంగా మంత్రి గారు కొసరి కొసరి వడ్డించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ పోకడ చూసి
కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతల సైతం అవాక్కయ్యారు.
ఇదిలా ఉంటే.. పర్యాటక ప్రమోషన్‌లో వినూత్న ఒరవడి... ప్రపంచ ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్ అంటూ మంత్రి దుర్గేష్ ప్రకటించారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఏపీ టూరిజం పరుగులు తీస్తోందని అన్నారు. అయితే అదే కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ టూరిజం అభివృద్ధి సంస్థ డైరెక్టర్.. టిడిపి నేత వాసిరెడ్డి రాంబాబు అసలు విషయాలు బయట పెట్టారు. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో విదేశాల కంటే అందమైన లొకేషన్స్ ఉన్నాయని అయితే అక్కడికి వెళితే టూరిస్టులకు కనీస సౌకర్యాలు లేవనీ.. టూరిజం శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సభలోనే బహిరంగంగా వాస్తవాలు తెలిపారు. దీంతో పర్యటక ప్రాంతాలకు సోషల్ మీడియా ద్వారా బూస్ట్ అప్ సంగతి అటుంచితే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం ముఖ్యమని అధికారులు తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఒక్క టూరిజం శాఖలోనే కాదు ఏపీలో కొత్తగా నిర్మాణం పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు సహా ఇతర శాఖల్లో ఇన్ ప్లూయెన్సర్ల హడావుడి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం వారికి ప్రజాధనాన్ని చెల్లింపులు చేసే వరకు వెళ్లడమే విమర్శలకు తావిస్తోంది. టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో పనిచేస్తున్న కార్యకర్తలకు దోచిపెట్టడమే అవుతుందని ఇప్పటికే వైసీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థను తీవ్రంగా తప్పుబట్టిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే తమ కంటెంట్ తో గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్లు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ పై అంతగా సానుకూలంగా లేరని తెలుస్తోంది. కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారం చేస్తే తమకు ఫాలోవర్స్ తగ్గిపోతారనే అభిప్రాయంతో వారు ఉన్నారు. ఒకవైపు వివాదాస్పదంగానూ.. మరోవైపు వాస్తవాలను కప్పిపుచ్చే ఈ విచిత్ర విధానంపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.