Konaseema Politics: కాకినాడలో ఎంపీ సానా సతీష్ వ్యవహారంపై రచ్చ.. సీనియర్ నేతల తీవ్ర అసంతృప్తి..!
Konaseema Politics: కాకినాడ జిల్లాలో ఆయనో ఎంపీ..! ఇటీవలే రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కింది..! ఎంపీ పదవి చేపట్టాక.. జిల్లాలో కర్ర పెత్తనం చేయాలని ఆయన భావిస్తున్నారు..! ఇప్పుడు కార్పొరేషన్, నామినేటేడ్ జడ్పీ చైర్మన్ పదవుల భర్తీ విషయంలో ఎంపీ తీరు వివాదస్పదంగా మారిందా..! రిజర్వేషన్లు ఖరారు కాకముందే.. అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం చర్చనీయాంశంగా మారిందా..! మరోవైపు కాకినాడ జిల్లాలో సీనియర్లంతా పక్కన పెట్టేయడంతో.. ఇప్పుడాయన కోనసీమ రాజకీయాల్లో వేలు పెట్టారనే చర్చ సాగుతోందా..!
Konaseema Politics: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీలో రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. అధిష్టానం నిర్ణయాలను ప్రభావితం చేసేలా జిల్లాకు చెందిన ఓ నాయకుడు చేస్తున్న రాజకీయం విమర్శల పాలవుతోంది. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండా జిల్లా టిడిపి కమిటీని తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆయన చేస్తున్న కర్రపెత్తనం కలకలం రేపుతోంది. ఒకే మాట మీద నిలిచి రాజకీయంగా గానీ, అభివృద్ధి పరంగా గానీ కలిసి అడుగులు వేసిన జిల్లా కూటమి నేతలు తాజాగా టిడిపిలో ఎంపీ సానా సతీష్ బాబు చేస్తున్న కర్ర పెత్తనంపై గుర్రుమంటున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ నేత ఎంపీ సానా సతీష్ బాబు చిన్నపాటి ఉద్యోగం చేసి అనంతరం వ్యాపార రంగంలో ఎదిగారు. ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ ఇక్కడి టిడిపి సీనియర్లకు ఆయనతో పెద్దగా పరిచయాలు లేవు. కానీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రను జిల్లాలోఆర్థికంగా నడిపించారని ప్రచారం ఉంది. ఇదే సమయంలో జిల్లాలో చక్రం తిప్పాలని ఆయన భావిస్తున్నారు. కానీ జిల్లాలో తన హవా సాగకపోవడంతో జిల్లాను వదిలేసి.. కోనసీమ రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జిల్లాలో సీనియర్ నేతల జోరు ముందు ఆయన రాజకీయం వెలవెలబోతోందన్న చర్చ జరుగుతోంది..
ప్రస్తుతం కాకినాడ జిల్లా తునిలో యనమల కుటుంబం, జగ్గంపేటలో జ్యోతుల కుటుంబం, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ సిటీలో వనమాడి కొండబాబు పట్టు బిగించారు. పిఠాపురం సెగ్మెంటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పెత్తనం చేయకుండా నిరోధిస్తున్నారు. కేవలం ప్రత్తిపాడులో మాత్రమే ఆయన వేలు పెట్టగలుగుతున్నారు. ఇప్పటివరకు ఆయన్ను యనమల, ఆయన వర్గం కలిసింది లేదు. అలాగే ఎమ్మెల్యే కొండబాబు కూడా అంతంత మాత్రమే. ఇక చినరాజప్ప 12 సార్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా కొనసాగారు.
గతంలో ఓసారి ఎమ్మెల్సీ, మూడుసార్లు ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవులు అధిష్టించారు. ఆయన సతీష్ రాజకీయాన్ని సహించరనే చర్చ జరుగుతోంది. మరోవైపు కాకినాడ పార్లమెంటు సభ్యులు జనసేనకు చెందిన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎంపీ సానా సతీష్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. ఉదయ శ్రీనివాస్ తొలిసారి రాజకీయాలకు వచ్చినా అధినేత పవన్ కళ్యాణ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పార్లమెంటులో ఉదయ శ్రీనివాస్ ప్రశ్న వేస్తే వెంటనే రాజ్యసభలో సతీష్ మాట్లాడుతారు. అలాంటి విభేదాలు నీవునుగప్పిన నిప్పులా వారి మధ్య ఉన్నాయి.
ఇటీవల కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సానా సతీష్ జోక్యంపై ఎమ్మెల్యే నానాజీ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఒక్క ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే సానాకు సానుకూల పరిస్థితి ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి కిలారు రాజేష్ ను ప్రసన్నం చేసుకుని సానా సతీష్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాగా వేశారు. తనకు అనుకూలురైన గుత్తుల సాయి, గంధం పల్లంరాజులను జిల్లా టిడిపి అధ్యక్ష, కార్యదర్శులను చేసుకోవడం మొదలుకుని, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సమన్వకర్తగా తానే నియమితులయ్యే వరకు సానా చక్రం తిప్పారు. తన హవా చాటుకునేందుకు రెండవసారి రాజ్యసభకు ఎంపికైన ఆయన వందలాది కార్ల ర్యాలీతో కోనసీమలో ఎంట్రీ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన బల ప్రదర్శన చేశారని అంటారు అంబేద్కర్ కోనసీమ తెలుగు తమ్ముళ్లు. అసలు అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీతో పెద్దగా పరిచయాలే లేవనే చెబుతారు.
ఇప్పుడు జిల్లాలో ఉన్న టిడిపి, జనసేన ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకోకుండా పార్టీ కార్యకలాపాలలో సానా చేస్తున్న హంగామా టిడిపి క్యాడర్ ను సైతం ఆందోళనకు గురి చేస్తోందని ప్రచారం సాగుతోంది. పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా తన ఆధిపత్యం చాటుకోవడమే లక్ష్యంగా సానా రాజకీయం చేస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. ఈ తరుణంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సానా శిష్యుడు గంధం పల్లంరాజు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ జిల్లా టిడిపి సమావేశం తీర్మానం చేయడం వివాదాస్పదంగా మారింది.
కోనసీమ జిల్లాలో టీడీపీ తరపున అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట టిడిపి ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి పరోక్షంలో జిల్లా టిడిపి సమావేశం నిర్వహించి పల్లంరాజు అభ్యర్థిత్వానికి మద్దతుగా తీర్మానం చేయడంపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మండిపడుతున్నట్లు సమాచారం.
జిల్లా టీడీపీ తీర్మానం వెనుక రాజ్యసభ సభ్యులు సానా సతీష్ హస్తం ఉందని, ఆయన పెత్తనానికి అడ్డుకట్ట వేయకపోతే జిల్లా టిడిపి నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని జిల్లా టిడిపి ముఖ్య నేతలు కొందరు జిల్లా ఇంచార్జి మంత్రి అచ్చన్నాయుడు, జోనల్ టిడిపి కోఆర్డినేటర్ సుజయ కృష్ణ రంగారావులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో టిడిపి అధిష్టానం అమలాపురంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగిన తీరుపై ఆరా తీస్తోంది. జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు స్వగృహంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పల్లంరాజు పేరును ఆమోదిస్తూ చేసిన తీర్మానం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ద్వారా కేటాయిస్తారో ఇంకా స్పష్టం కాలేదు. కూటమి సర్దుబాట్లలో ఏ పార్టీకి దక్కుతుందో తెలియదు. ఒకవేళ జనరల్ కేటగిరీ వస్తే చైర్మన్ పదవికి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరాం, జిల్లా టిడిపి ప్రధానకార్యదర్శి గంధం పల్లంరాజు, మాజీ జడ్పిటిసి దేశంశెట్టి లక్ష్మినారాయణ రంగంలోకి దిగారు. బిజెపికి కేటాయిస్తే తాను పోటీలో ఉంటానని ఆ పార్టీ నేత యాళ్ళ దొరబాబు తెర పైకి వచ్చారు. ఇక జనసేన తరపున కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జి బండారు శ్రీనివాస్ ఉత్సాహం చూపుతున్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు అయ్యింది.
ఈ సమయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున గంధం పల్లంరాజు పేరును ఏకపక్షంగా ప్రతిపాదిస్తూ తీర్మానం చేయడం విమర్శలకు గురవుతోంది. దశాబ్దాల తరబడి పార్టీలో పని చేస్తున్న వారు ఎందరో ఆశవహులుగా ముందుకు వచ్చారు. వారిలో సమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా టిడిపి నాయకత్వం ప్రదర్శించిన అత్యుత్సాహం ఇటు టీడీపీలో ఆశావహుల మధ్య విభేదాలకు దారి తీయడంతో పాటు కూటమి సంబంధాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తంమీద జిల్లాలో జడ్పీ చైర్మన్ ఎంపిక నేతల మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేస్తోంది. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లు రిజర్వేషన్ తేలలేదు.. ఏ సామాజిక వర్గానికి పదవి దక్కుతుందో తెలియదు. కూటమిలో ఏ పార్టీకి అవకాశం వస్తుందో తెలియదు. ఇప్పుడే ఇంత తొందరెందుకు అధ్యక్షా అని జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి తీరును పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. ఎంపీ సాన సతీష్ కర్ర పెత్తనం చేస్తూ తన అనుచరులను తమపై రుద్దుతున్నారని తెలుగు తమ్ముళ్లు గుస్సా అవుతున్నారు.
దీనిపై అధిష్టానంకు ఫిర్యాదు చేసేందుకు కొందరు నేతలు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఒకపక్క సొంత జిల్లాలో, కాకినాడలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎంపీ సాన సతీష్, సొంత ఇల్లు చక్కదిద్దుకోవడం మాని తమ జిల్లాలో ఎలా చొరబడతారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆయన వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కాకినాడ రూరల్ టిడిపి ఇంచార్జ్ పదవి కేటాయింపులోనూ ఆయన చక్రం తిప్పారని, పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లేకుండా చేశారని ఆరోపణలు వెల్లువెత్తున నేపథ్యంలో ఆయన పక్క జిల్లా వైపు తొంగి చూడడం మరో వివాదానికి దారితీస్తోంది.