EPFO Whatsapp Service: ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు, పాత ఖాతాలకు ఆటో సెటిల్‌మెంట్!
EPFO Whatsapp Service Launch: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం రెండు కీలకమైన డిజిటల్ సౌకర్యాలను ప్రకటించింది. ఇకపై పీఎఫ్ (PF) ఖాతాదారులు EPFO కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే తమ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్, క్లెయిమ్ స్టేటస్ వంటి సేవలను సులభంగా పొందవచ్చు. అంతేకాకుండా, పాత కంపెనీల్లో నిలిచిపోయిన రూ.1,000 వరకు ఉన్న క్రియారహిత పీఎఫ్ ఖాతా మొత్తాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసే నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.
EPFO Whatsapp Service Launch: 2026 నవంబర్ 1న ఈపీఎఫ్ఓ (EPFO) 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రెండు కీలక డిజిటల్ సేవా కార్యక్రమాలను వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పీఎఫ్ సేవలను చందాదారులకు మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం.
వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు..
ఇప్పటివరకు పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలన్నా, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా లేదా క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయాలన్నా UMANG యాప్ లేదా EPFO అధికారిక పోర్టల్‌పై ఆధారపడాల్సి వచ్చేది. అయితే నూతన విధానంలో ఈపీఎఫ్ఓ అందించే అధికారిక వాట్సాప్ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపడం ద్వారా క్రింది సేవలను పొందే అవకాశం ఉంటుంది.
పీఎఫ్ బ్యాలెన్స్ పరిశీలన..
మీ పీఎఫ్ ఖాతాలో ప్రస్తుతం ఉన్న నిల్వ సొమ్ము వివరాలను తక్షణమే తెలుసుకోవచ్చు. పాస్‌బుక్ డౌన్‌లోడ్ అనగా పీఎఫ్ పాస్‌బుక్ ప్రతిని నేరుగా వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అలాగే పీఎఫ్ ఖాతాకు సంబంధించిన UAN అనగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తనిఖీ చేయడంతో పాటు e-KYC స్టేటస్ యాక్టివ్‌గా ఉందో లేదో వివరాల స్థితిని సరిచూసుకోవచ్చు.
పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్..
మీరు సమర్పించిన పీఎఫ్ విత్‌డ్రాయల్ లేదా ఇతర క్లెయిమ్‌ల ప్రస్తుత పురోగతిని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సేవలను వినియోగించుకోవడానికి ఉద్యోగి మొబైల్ నంబర్ UAN ఖాతాతో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. EPFO త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వాట్సాప్ నంబర్‌ను ప్రకటించనుంది.
రూ.1,000 వరకు పాత ఖాతాల ఆటో సెటిల్‌మెంట్..
చాలామంది ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాల్లో ఉన్న రూ.500 లేదా రూ.1,000 వంటి చిన్న మొత్తాలను క్లెయిమ్ చేయడానికి ఆసక్తి చూపరు. ఫలితంగా ఆ ఖాతాలు సంవత్సరాల తరబడి క్రియారహితంగా (Inoperative) ఉండిపోతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు అర్హత కలిగిన క్రియారహిత ఖాతాల్లో ఉన్న రూ.1,000 వరకు మొత్తాలను EPFO స్వయంక్రియంగా (ఆటోమేటిక్) సెటిల్ చేసే సదుపాయాన్ని తీసుకొస్తోంది.
ఈ ఆటో సెటిల్‌మెంట్ విధానం ద్వారా ఆయా చిన్న మొత్తాలు ఉద్యోగి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు లేదా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న పీఎఫ్ ఖాతాకు నేరుగా బదిలీ చేయబడతాయి. దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలు, అమలు విధానాన్ని EPFO అధికారిక మార్గదర్శకాల ప్రకారం పరిశీలించాల్సి ఉంటుంది.
ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు...
ఈ డిజిటల్ సంస్కరణలు కోట్లాది మంది ఉద్యోగులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమను నివారిస్తాయి. ఏళ్ల తరబడి పాత ఖాతాల్లో నిరుపయోగంగా ఉండిపోయిన సొమ్ము ఆటో సెటిల్‌మెంట్ ద్వారా తిరిగి ఉద్యోగులకు లభించడం ఎంతో ఊరట కలిగించే అంశం.