బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? 46 ఏళ్ల డేటా చెబుతున్న అసలు లెక్కలు ఇవే..!!
Gold Investment: బంగారాన్ని చాలా మంది అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పుడు లేదా ఆర్థిక పరిస్ధితులు అనిశ్చితంగా మారిన సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.
Gold Investment: బంగారాన్ని చాలా మంది అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పుడు లేదా ఆర్థిక పరిస్ధితులు అనిశ్చితంగా మారిన సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి నష్టాలు రావనకోవడం కూడా పొరపాటే. ఎందుకో తెలుసుకుందాం.
ఫండ్స్ ఇండియా రిపోర్టు ప్రకారం.. జనవరి 1980 నుంచి అక్టోబర్ 2026 వరకు పసిడి ధరలను పరిశీలించినట్లయితే.. ఈ కాలంలో దాదాపు సగం ట్రేడింగ్ రోజుల్లో పసిడి ధర గతంలో నమోదైన గరిష్ట స్థాయి కంటే 10 శాతానికి పైగానే తగ్గింది. సెన్సెక్స్ లోనూ దాదాపు 48శాతం రోజుల్లో ఇలాంటి పరిస్ధితే కనిపించింది. అంటే స్టాక్ మార్కెట్లో మాదిరిగానే గోల్డ్ లోనూ ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. బంగారాన్ని పూర్తిగా రిస్క్ లేని పెట్టుబడిగా భావించడం సరైంది కాదు.
బంగారం ధరలు భారీగా పడిపోయినప్పుడు మళ్లీ పాత స్థాయికి చేరుకునేందుకు చాలా కాలం పడుతుంది. దీనికి గతంలో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1980 జనవరిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత 1982 జూన్ నాటికి దాదాపు 57శాతం తగ్గాయి. తిరిగి పాత గరిష్ట స్థాయికి చేరుకునేందుకు 1989 నవంబర్ వరకు సమయం పట్టింది. అంటే ఇన్వెస్టర్ల దాదాపు 10ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. అలాగే 1996 ఫిబ్రవరిలో నమోదు అయిన గరిష్ట ధర తర్వాత బంగారం విలువ సుమారు 31శాతం పడిపోయింది. తిరిగి పాత ధరకు చేరుకునేందుకు 6ఏండ్ల 4 నెలల సమయం పట్టింది. 2012 నవంబర్ లో నమోదైన గరిష్ట స్థాయి తర్వాత కూడా బంగారం ధర దాదాపు 29శాతం మేర తగ్గింది. మళ్లీ పాత స్థాయికి చేరుకునేందుకు 6ఏండ్ల 7 నెలల సమయం పట్టింది.
బంగారం ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులకు ఇటీవలి పరిణామాలు కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయని గమనించాలి. 2026 జనవరి 30న భారత్ లో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,79, 140 గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే 2026 నవంబర్ 16నాటికి ఈ ధర సుమారు రూ. 1, ,35,430కి చేరింది. అంటే గరిష్ట ధరతో పోల్చి చూస్తే దాదాపు 24శాతం మేర తగ్గింది. బంగారం ధరలు 5,10, 20 శాతం తగ్గిన సందర్భాల్లో సెన్సెక్స్ తో పోల్చితే పెద్దగా తేడా ఉండదు. అయితే 30శాతానికి మంచి భారీగా పడిపోయిన సందర్బాల్లో సెన్సెక్స్ లో ఇలాంటి తగ్గుదల ఎక్కువసార్లు నమోదు అయ్యింది. దీన్ని బట్టి బంగారంలోనూ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ధరల తగ్గుదలను పరిగణలోనికి తీసుకోవాలి.
ఫండ్స్‌ఇండియా అధ్యయనం ప్రకారం.. స్వల్పకాలంలో బంగారం ధరలలో గణనీయమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఇది మంచి రాబడిని ఇచ్చింది. 1980 నుండి 10 సంవత్సరాల పెట్టుబడి కాలాన్ని పరిశీలిస్తే, బంగారం సంవత్సరానికి సగటున సుమారు 10శాతం రాబడిని ఇచ్చింది. అంతేకాకుండా, ఈ అధ్యయనంలో పరిశీలించిన పూర్తి అయిన పదేళ్ల కాలాల్లో దేనిలోనూ బంగారం ప్రతికూల రాబడిని ఇవ్వలేదు. అయితే, బంగారంలో పెట్టుబడి పెట్టడం ప్రాథమిక ఉద్దేశ్యం కేవలం లాభాలను ఆర్జించడం మాత్రమే కాదు. దీనిని వివిధ మార్గాల్లో పెట్టుబడులను వైవిధ్యపరచడానికి కూడా ఉపయోగించవచ్చు.
కొన్ని సందర్భాల్లో, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు బంగారం బాగా రాణించగలదు. అయితే, స్టాక్ మార్కెట్ నష్టాలను బంగారం ఎల్లప్పుడూ భర్తీ చేస్తుందని చెప్పలేము. అందువల్ల, పెట్టుబడిదారులు తమ డబ్బు మొత్తాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టకూడదు, స్టాక్స్, బంగారం, ఇతర పెట్టుబడి సాధనాల మధ్య సరైన సమతుల్యతను పాటించాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు, పెట్టుబడి సామర్థ్యం, నష్టభయాన్ని తట్టుకునే శక్తి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.