ఎలాంటి రిస్క్ లేకుండా మీ డబ్బు డబుల్.. రూ. లక్ష పెడితే రూ. 2 లక్షలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఇదే!
KVP Scheme 2026: తమ కష్టార్జితాన్ని సురక్షితంగా దాచుకోవడంతో పాటు మెరుగైన రాబడిని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఎదురయ్యే నష్టభయాన్ని .. భరించడానికి చాలామంది ఇష్టపడరు.
KVP Scheme 2026: తమ కష్టార్జితాన్ని సురక్షితంగా దాచుకోవడంతో పాటు మెరుగైన రాబడిని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఎదురయ్యే నష్టభయాన్ని .. భరించడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ వికాస్ పత్ర పథకం ఒక అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ పొదుపు పథకానికి సంబంధించిన పూర్తి విశేషాలు, వడ్డీ రేట్లు, నిబంధనలు ఇక్కడ ఉన్నాయి.
కిసాన్ వికాస్ పత్ర (KVP) ప్రత్యేకతలు ఏమిటి?
కిసాన్ వికాస్ పత్ర అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇందులో మదుపు చేసే ప్రతి రూపాయికి ప్రభుత్వ పూర్తి భద్రత ఉంటుంది. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులతో ఏమాత్రం సంబంధం లేకుండా, ప్రభుత్వం నిర్ణయించిన స్థిర వడ్డీ రేటు ప్రకారం కచ్చితమైన రాబడి లభిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు తమ డబ్బును ఎటువంటి ఆందోళన లేకుండా సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వారికి ఈ పథకం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
కనీస, గరిష్ఠ పెట్టుబడి పరిమితులు:
ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఆ తర్వాత రూ.100 చొప్పున ఎంత మొత్తమైనా అదనంగా జమ చేసే వెసులుబాటు ఉంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇందులో గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. అంటే పెట్టుబడిదారులు తమ ఆర్థిక స్థోమతను బట్టి ఎంత పెద్ద మొత్తమైనా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తోంది? డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుంది?
2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి గాను కిసాన్ వికాస్ పత్రపై కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీని ఏటా చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. ప్రస్తుత 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం.. ఇందులో పెట్టిన పెట్టుబడి మొత్తం సరిగ్గా 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. అంటే మీ డబ్బు డబుల్ కావడానికి సుమారు 9 సంవత్సరాల 7 నెలల సమయం పడుతుంది.
రూ.కోటి పెట్టుబడి పెట్టవచ్చా? రాబడి లెక్కలు ఇలా..
కిసాన్ వికాస్ పత్ర పథకంలో గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేనందున.. ఆర్థిక సామర్థ్యం ఉన్నవారు పెద్ద మొత్తంలో కూడా నిధులను జమ చేసుకోవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం రాబడి ఎలా ఉంటుందో చూద్దాం:
రూ.1 లక్ష పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ.2 లక్షలు చేతికి అందుతాయి.
రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే గడువు ముగిసేసరికి రూ.20 లక్షలు లభిస్తాయి.
ఒకవేళ రూ.1 కోటి పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ నాటికి సుమారు రూ.2 కోట్ల వరకు పొందే అవకాశం ఉంటుంది.
పన్ను నిబంధనలు:
అయితే.. ఇందులో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు ఆదాయపు పన్ను నిబంధనలు, ఆదాయ వనరులు, మెచ్యూరిటీ గడువు మరియు ముందస్తు ఉపసంహరణ నియమాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
ఈ పథకం ద్వారా లభించే వడ్డీ ఆదాయంపై ఆదాయపు పన్ను వర్తిస్తుంది.
అంతేకాకుండా.. ఇందులో పెట్టే పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఎలాంటి పన్ను మినహాయింపు లభించదు.
ఈ పథకం ఎవరికి ఉత్తమం?
దీర్ఘకాలిక పొదుపు లక్ష్యాలు ఉన్నవారికి.. తమ అసలు మొత్తంపై మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి కిసాన్ వికాస్ పత్ర ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు.. సీనియర్ సిటిజన్లు స్థిరమైన రాబడి కోసం ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.
అయితే.. ఇందులో జమ చేసిన డబ్బును అవసరమైనప్పుడల్లా వెంటనే వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. సాధారణంగా పెట్టుబడి పెట్టిన రెండున్నరేళ్ల (30 నెలల) తర్వాత మాత్రమే నిర్దిష్ట నిబంధనలకు లోబడి ముందస్తు ఉపసంహరణకు వీలుంటుంది. కాబట్టి అత్యవసర అవసరాల కోసం పక్కన పెట్టుకున్న డబ్బును ఇందులో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించి తాజా వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ గడువు, ఇతర నిబంధనలను స్వయంగా తెలుసుకోవడం ఉత్తమం.