Zee Entertainment: వినోద రంగ దిగ్గజ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) ఉన్నత స్థాయి నాయకత్వంలో కీలక మార్పు చేసింది. సంస్థ నూతన చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (CCO), కంపెనీ సెక్రటరీ (CS) గా సంగీతా శెట్టిని నియమిస్తున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన ఆశిష్ అగర్వాల్ వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 29న తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సంగీతా శెట్టి నవంబర్ 2వ తేదీ నుంచి అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె నియామకాన్ని నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు చేసింది. తదనంతరం శుక్రవారం జరిగిన సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు దీనిని ఆమోదించారు. ముంబైలోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఆమె విధులు నిర్వర్తిస్తారు. అలాగే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పునీత్ గోయెంకాకు ఆమె నేరుగా రిపోర్ట్ చేస్తారు.
సంగీతా శెట్టికి కార్పొరేట్ గవర్నెన్స్, లీగల్ వ్యవహారాలు, రెగ్యులేటరీ నిబంధనల అమలులో దాదాపు 20 ఏళ్లకు పైగా అపారమైన అనుభవం ఉంది. గతంలో దేశంలోని ప్రముఖ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వ్యాపార విస్తరణ, పారదర్శక పాలన, చట్టబద్ధమైన నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో ఆమె చూపిన ప్రతిభను దృష్టిలో ఉంచుకుని జీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, చట్టపరమైన నిబంధనల సమర్థ నిర్వహణలో భాగంగా ఆమె అనుభవం కంపెనీకి ఎంతగానో ఉపయోగపడుతుందని జీ ఎంటర్‌టైన్‌మెంట్ వర్గాలు పేర్కొన్నాయి.
కొత్త బాధ్యతల్లో సంగీతా శెట్టి రెగ్యులేటరీ కంప్లయన్స్ మెరుగుపరచడం, వాటాదారుల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం వంటి కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు. భవిష్యత్ వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వ్యాపార కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన రిస్క్ మేనేజ్‌మెంట్‌ను ప్రోత్సహించేలా పటిష్టమైన పాలనా ప్రమాణాలను నెలకొల్పడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని వెల్లడించింది.
కంపెనీ సీఈఓ పునీత్ గోయెంకా మాట్లాడుతూ.. సుస్థిరమైన వృద్ధి సాధనకు, వాటాదారుల్లో విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఉన్నత స్థాయి పాలన, పారదర్శకత అత్యంత కీలకమన్నారు. లిస్టెడ్ కంపెనీలలో కంప్లయన్స్ ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించడంలో శెట్టికి విస్తృతమైన అనుభవం ఉందన్నారు. తమ సంస్థాగత సామర్థ్యాలను ఆమె మరో స్థాయికి తీసుకెళ్లారని నమ్మకం ఉందని చెప్పారు.