Traffic Police Special Drive: సరైన నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడటం వంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఒక్క హైదరాబాద్‌లోనే కాదు కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులను నిలువరించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వారికి అవగాహన కల్పించిన అనంతరం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి చలాన్లు విధించారు.
ఉల్లంఘించిన వాహనదారులను పోలీసులు తనిఖీ చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదని తెలిపారు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతకు బాధ్యత వహించాలని తెలిపారు. వాహనాల తనిఖీల్లో గోదావరిఖని సీఐ రాజేశ్వరరావు, మంచిర్యాల సీఐ ఎండీ హనన్, పెద్దపల్లి ఎస్సై చెంచు గంగన్నతోపాటు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కోకాపేటలో తీవ్ర విషాదం..
హైదరాబాద్‌లోని కోకాపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి మందలించడంతో 23వ అంతస్తుపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కాలేజీకి వెళ్లి చదువుకోవాలని మందలించడంతో మనస్తాపం చెందిన యువతి ప్రాణాలు తీసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట ప్రెస్టేజ్ అపార్ట్‌మెంట్స్‌లో ఓ కుటుంబం నివసిస్తోంది. మాదాపూర్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లాస్య లహరి (15) అక్టోబర్ 29వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో భవనం దూకి తీవ్ర గాయాలతో మృతిచెంది. కూతురి మృతిపై నార్సింగి పోలీసులకు తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.