Anitha Chowdary: విమాన టికెట్ల బుకింగ్ పేరుతో సినీ నటి అనితకు సైబర్ మోసం.. రూ.4.14 లక్షలు మాయం!
Anitha Chowdary: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా సినీ నటి గోగినేని అనిత సైబర్ మోసానికి గురయ్యారు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు బుక్ చేస్తామని నమ్మించిన కేటుగాళ్లు ఆమె బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ.4.14 లక్షలు కాజేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Anitha Chowdary: వివరాల్లోకి వెళ్తే.. సినీ నటి గోగినేని అనిత హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇందుకోసం విమాన టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ కోసం వెతుకుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించారు.
'లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్' సంస్థకు చెందిన వారమంటూ రాజేష్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధర రూ.4,14,180 అవుతుందని చెప్పాడు. టికెట్ బుకింగ్ ప్రక్రియ కోసం తన డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన అనిత కార్డు వివరాలను అందించారు. అంతేకాకుండా టికెట్ బుకింగ్ కోసమేనని భావించి తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా చెప్పేశారు.
ఆ తర్వాత ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.4,14,180 డబ్బులు కట్ అయ్యాయి. అయితే డబ్బులు చెల్లించినప్పటికీ విమాన టికెట్ బుకింగ్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలు ఆమెకు అందలేదు. ఖాతా నుంచి డబ్బులు వెళ్లిపోవడం, టికెట్లు రాకపోవడంతో తాను మోసపోయినట్లు అనిత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలియని వ్యక్తులకు బ్యాంక్ కార్డు వివరాలు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని పోలీసులు సూచిస్తున్నారు. విమాన టికెట్లు లేదా ఇతర ఆన్‌లైన్ బుకింగ్‌లు చేసేటప్పుడు అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలని హెచ్చరిస్తున్నారు.