HBD Prabhas: ఇండియన్ బాక్సాఫీసు రారాజు రెబల్ స్టార్ ప్రభాస్.. 24 ఏళ్ల సినీ ప్రయాణం, అత్యధిక కలెక్షన్స్ రికార్డు!
Happy Birthday Prabhas: తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్, 'ఈశ్వర్' చిత్రంతో మొదలుపెట్టి 24 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 'బాహుబలి', 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాలతో గ్లోబల్ మార్కెట్‌లో అపూర్వ ప్రభంజనం సృష్టించిన ఆయన, బాక్సాఫీస్ వద్ద రెండుసార్లు రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఏకైక భారతీయ కథానాయకుడిగా రికార్డు సృష్టించారు. నేడు (అక్టోబరు 23) రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ కెరీర్‌పై స్పెషల్ స్టోరీ!
Happy Birthday Prabhas: 'ఈశ్వర్' సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రభాస్ ప్రయాణం గత 24 ఏళ్లుగా విజయవంతంగా సాగుతోంది. కెరీర్ ప్రారంభం నుంచి 'వర్షం', 'ఛత్రపతి', 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'మిర్చి' వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా ఎదుగుతూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'బాహుబలి' చిత్రాలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమల మధ్య ఉన్న ప్రాంతీయ, భాషా హద్దులను చెరిపివేసి, సరికొత్త పాన్ ఇండియా ట్రెండ్‌కు రాచబాట వేశారు.
బాక్సాఫీస్ రికార్డులు - తిరుగులేని గ్లోబల్ క్రేజ్..
ఉత్తరాది మార్కెట్‌లో బాలీవుడ్ అగ్ర తారలతో సమానంగా వసూళ్లు రాబట్టే సత్తా ప్రభాస్ సొంతం. ఆయన చిత్రాలకు కేవలం భారతదేశంలోనే కాకుండా అమెరికా, యూకే, జపాన్ వంటి విదేశాల్లోనూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో 10 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హీరోగా చరిత్ర సృష్టించిన ప్రభాస్.. 'బాహుబలి 2', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో రెండుసార్లు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఏకైక స్టార్‌గా నిలిచారు. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా నిర్మాతలకు అత్యుత్తమ రాబడిని అందిస్తున్నారు.
నిరాడంబరత, దాతృత్వం..
ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రభాస్ తనదైన వినమ్రతతో అందరినీ 'డార్లింగ్' అని పలకరిస్తుంటారు. తనతో పనిచేసే తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన అందించే రుచికరమైన విందు, ఆతిథ్యం చిత్ర పరిశ్రమలో కథలుగా చెప్పుకుంటారు. ప్రకృతి విపత్తుల వేళల్లో ఉదారంగా భారీ విరాళాలు అందించడం, డ్రగ్స్ నివారణకు ప్రచారం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుంటారు. దర్శకుల సృజనాత్మక విజన్‌ను సంపూర్ణంగా నమ్మి పనిచేసే అరుదైన స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నారు.
భారీ లైనప్, దూసుకుపోతున్న ప్రాజెక్టులు..
ఏడాదికి కనీసం రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాలనే సంకల్పంతో ప్రభాస్ శరవేగంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2', ప్రశాంత్ నీల్ రూపొందించనున్న 'సలార్ 2' వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో 'ఫౌజీ' చిత్రం వచ్చే సమ్మర్‌లో, 'స్పిరిట్' చిత్రం వచ్చే ఏడాది దీపావళికి విడుదలకు సిద్ధమవుతున్నాయి.