Jailer To Ranabali:అక్టోబర్ నెలలో సినిమాల జాతర నడవబోతుందనే చెప్పాలి. ఒకటి రెండు కాదు.. ఏకంగా 15 సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ప్రతీ వారం కనీసం మూడు నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. ముందుగా అక్టోబర్ 2న గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రోజైతే ఏకంగా వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సహా 8 సినిమాలు విడుదలవుతున్నాయి.
వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు మాటల రచయతగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్.. స్టార్ డైరెక్టర్ అయ్యాకా.. ఓ సీనియర్ హీరోతో బడా ప్రాజెక్ట్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పాలి. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’లో కాసేపు వెంకీ మెరిసారు. ఇపుడు తనకు లైఫ్ ఇచ్చిన వెంకీతో డైరెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’ అంటూ యాక్షన్ క్రైమ్ ఫ్యామిలీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.
‘ఆదర్శ కుటుంబం’తో బోణి..
‘ఆదర్శ కుటుంబం’తో పాటు రాజమౌళి సమర్పకుడిగా ఉన్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, జేసన్ సంజయ్ ‘సిగ్మా’, హర్ష్ రోషన్ తెల్ల కాగితం, హిందీ సినిమా అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘దృశ్యం ది కంక్లూజన్’ విడుదల కాబోతున్నాయి.
ఇక అక్టోబర్ రెండో వారంలో మరో దండయాత్ర..
అక్టోబర్ 9న శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ రానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది. వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అలరిస్తున్న శ్రీ విష్ణు .. తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
దసరా బరిలో జైలర్ 2 వర్సెస్ రణబాలి..
అక్టోబర్ 15న జైలర్ 2 సినిమా రాబోతుంది. రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ‘జైలర్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ‘జైలర్’మూవీ తెలుగు సహా ఇతర భాషల్లో ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో తెలిసిందే కదా. తాజాగా రాబోతున్న ‘జైలర్ 2’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
అటు అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా రాబోతుంది. ‘టాక్సీవాలా’ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పీరియాడిక్ పేట్రియాట్రిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. రాయలసీమకు చెందిన ‘రణబాలి’ అనే స్వాతంత్య్ర సమరయోధుడి కథలో రాబోతుంది. ఈ రెండు చిత్రాలు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్నాయి.
ఈ రెండు సినిమాల పోటీలో అక్టోబర్ 16న ధనుష్ ‘ఓం’ సినిమా విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ముమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక అక్టోబర్ 30న విశ్వక్‌సేన్ నటించిన ‘కల్ట్’.. రోషన్ మేక హీరోగా నటించిన ‘ఏమో ఏమో ఇది’ .. ‘ఇట్లు అర్జున’ వంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.